2020 నాటికి దేశంలోనే.. 

ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం
– ప్రపంచ పటంలో ఏపీని పెట్టేందుకు యువతలో నైపుణ్యాలు పెంచుతాం
– యువత చేతుల్లోనే రాష్ట్ర భవిత
– మనం ఉద్యోగాలు చేయడం కాదు.. ఇచ్చే స్థాయికి ఎదగాలి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
తిరుపతి, ఆగస్టు4(జ‌నం సాక్షి) : ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని అధిగమిస్తూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, 2020 నాటికి ఏపీని దేశంలోనే అగ్ర స్థానంలో నిలుతీరుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల్లో సామర్థ్యం పెంపే లక్ష్యంగా తిరుపతిలో శనివారం నిర్వహించిన ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర భవితవ్యం యువత, విద్యార్థుల చేతిలో ఉందని సూచించారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు చెప్పారు. రాష్టాన్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు యువతలో నైపుణ్యాలు పెంచుతామని వివరించారు. ఏదేశానికీ లేని అనుకూలతలు భారత్‌కు, ఆంధప్రదేశ్‌కు ఉన్నాయని అన్నారు.ఈ యూనివర్సిటీలోనే చదువుకుని అసెంబ్లీకి వెళ్లానని, వెంకటేశ్వరస్వామిసన్నిధిలో జ్ఞనభేరి ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇంగ్లీష్‌ మాట్లాడే దేశం భారత్‌ అన్నారు. ఐటీ వల్ల ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌గా మారిందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడేనని తెలిపారు. మనం ఉద్యోగాలు చేయడం కాదు.. ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలపునిచ్చారు. అన్ని రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రపంచం మారుతున్నట్టే సాంకేతిక రంగంలో కూడా మార్పులు శరవేగంగా వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో చేతిలో సెల్‌ఫోన్‌ తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు రానున్నాయని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలపై రూపొందించిన లఘచిత్రాలను జ్ఞానభేరి వేదికపై ప్రదర్శించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థుల జానపద నృత్యాలు, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ విద్యార్థుల యోగాసనాలు అలరించాయి.

తాజావార్తలు