21న బ్యాంకర్లతో ఆర్‌బిఐ చర్చలు

వడ్డీ బదలాయింపుపై సవిూక్ష
ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఈ నెల 21న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపు లబ్ధిని వినియోగదారులకు బదలాయింపుపై ఇందులో చర్చిస్తారు. ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగం అనంతరం శక్తికాంత దాస్‌ విూడియాతో మాట్లాడారు. ద్రవ్య పరపతి విధాన సవిూక్ష నిర్ణయాలను బ్యాంకులు అమలు చేయడం ముఖ్యమన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ఫిబ్రవరి 21న బ్యాంకు సీఈవోలతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు బోర్డు సమావేశంలో ప్రసంగించిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ గురించి బోర్డు సభ్యులకు వివరించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. ‘ఆదాయాల పరంగా ఈ ఐదేళ్లలో మంచి వృద్ధి సాధించాం. ప్రస్తుతం భారత్‌కు బలమైన మెగా బ్యాంకులు కావాలి. అవి తక్కువ సంఖ్యలో ఉన్నా సరే, వాటి అవసరం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ రంగం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని జైట్లీ చెప్పారు. ఇటవల ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో కీలక వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6.25శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.