23నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి
తిరుపతి,ఆగస్ట్9(జనం సాక్షి): నెల 23 నుంచి టిటిడి ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏటా శ్రావణ మాసంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని 23 నుంచి 26 వరకు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని జేఈవో పోల భాస్కర్ జిల్లా ధర్మప్రచార సభ్యులకు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ధర్మప్రచార మండళ్ల బలోపేతానికి సంస్థాగతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజలను, అర్చకులను, వేద పారాయణదారులను, భజన మండళ్ల సభ్యులను, శ్రీవారి సేవకులను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో భక్తిభావం నింపి ఆయా గ్రామాల్లోని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే మనగుడి ఉద్దేశమని వివరించారు. తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సమన్వయంతో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది ఆలయాల్లో శ్రావణ పౌర్ణమి పర్వదినాన మనగుడి కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ధర్మప్రచారంలో భాగంగా దేవాలయాల్లో అర్చకులుగా ఉంటూ, ధార్మిక ప్రవచనాలు చేయగలిగే అర్చక స్వాములను దేవాదాయశాఖ ద్వారా గుర్తించి క్షేత్రస్థాయిలో ప్రజలకు సనాతన హైందవ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, ప్రముఖ దేవాలయాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు తితిదే ప్రచురణలు అందుబాటులో ఉంటాయన్నారు.