ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నిందితుల అరెస్ట్

వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 2 (జనంసాక్షి): సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు శనివారం వేములవాడ గ్రామీణ సిఐ కృష్ణకుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపాకకు చెందిన తమ్మినేని చందు, సికింద్రాబాద్ కు చెందిన పగడాల ఉమామహేశ్వర్ లు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రాఫిట్ మార్ట్ డాట్ కం, డఫాబెట్ ఆన్లైన్ గేమ్ పేరుతో అధిక డబ్బులు సంపాదించవచ్చని అమాయక ప్రజలను నమ్మించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. వేములవాడ గ్రామీణ మండలం కు చెందిన కనపర్తి నారాయణ కు ఫోన్ చేసి డబ్బులు వసూల్ చేయగా, తిరిగి ఇవ్వకపోవడంతో మోసానికి గురైనట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అవగా దర్యాప్తు చేసి ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురయితే ఎన్సీఈఆర్టీ పోర్టల్ లో గాని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సిఐ కృష్ణకుమార్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

తాజావార్తలు