అసంపూర్తి తడకలతో అవస్థలు పడుతున్న భక్తులు
వేములవాడ సెప్టెంబర్ 5 (జనంసాక్షి): వేములవాడ బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి అంటూ అటు ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం కూడా విస్మరిస్తున్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ అమ్మవారికి పెద్ద సంఖ్యలో బోనాల మొక్కలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. మంగళవారం బద్ధి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో అసంపూర్తిగా ఉన్న తడకల వల్ల క్యూ లైన్ లలో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తక్కువ ఎత్తులో ఉన్న తడకలు, బొంగులతో నెత్తిపై బోనం జారుతుందేమోనన్న భయంతో మొక్కులు చెల్లించాల్సి వస్తుందని భక్తులు వాపోయారు. ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడం పై నిర్లక్ష్యం వహించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ ఆదాయంపైనే కాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో కృషి చేయాలని వారు కోరుతున్నారు.