సమాజ సేవకు మా జీవితాలు అంకితం చేశాం

– ఎమ్మెల్యేటికెట్‌ ఇవ్వొద్దని ప్రతి పక్షాలన్నీ ఏకమైనయ్‌
– వాస్తవ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
జనంసాక్షి, మంథని : 30ఏండ్ల రాజకీయ జీవితంలో వివిధ పదవులు చేపట్టిన తాము సమాజ సేవకే తమ జీవితాలు అంకితం చేశామని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ద్వితీయ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆనాడు ఎమ్మెల్యేగా, ఈనాడు జెడ్పీ చైర్మన్‌గా మంథని ప్రాంతంలోని పేద ప్రజలను ఆదరించి అన్నం పెడుతుంటే ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన వివరించారు. చావులను వాడుకుని లబ్ది పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓ మున్నూరు కాపు ఆడబిడ్డను రోడ్డున పడేసే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. ఆరేండ్ల క్రితం జరిగిన ఓ సంఘటనలో ఫిర్యాదులో ఉన్న వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడే, ఆ వ్యక్తిపై కేసు కాకుండా కాపాడేది కాంగ్రెస్‌ పార్టీ నాయకుడే కానీ ఆ సంఘటనలో తనపై ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఆనాడు ఈ సంఘటనతో గట్టెక్కిన ప్రస్తుత ఎమ్మెల్యే మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అదే సంఘటనను తెరమీదకు తీసుకువస్తున్నాడని ఆయన వాపోయారు. మున్నూరు కాపులు, బీసీలు అత్యధికంగా ఉన్న మంథని నియోజకవర్గంలో 40ఏండ్లుగా ఒకే కుటుంబ రాజ్యాధికారంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఓట్లతో అధికారం చేపట్టి కనీసం నీళ్లు పోయని, అన్నం పెట్టి ఆకలి తీర్చని, పైసా సాయం చేయనోళ్లే మళ్లీ ఓట్ల కోసం వస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, అలాంటి వాళ్లు ఆరోపణలు చేస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు చేసే ఆరోపణల్లో ఏదీ నిజం, ఏదీ అబద్దమో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దని ప్రతిపక్షాలు ఒకే వేదికపై రావడం ఒక్క మంథనిలోనే జరిగిందని, ఎక్కడా ఇలాంటి సంఘటన జరుగలేదన్నారు. అలాంటి విచిత్రపరిస్థితులు ఉన్న మంథనిపై మీడియా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వాస్తవ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉందన్నారు.

తాజావార్తలు