వెంకట్రామ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
– ప్రతీ ఒక్కరు సేవ చేసే గుణాన్ని కలిగి ఉండాలి
– మంథని భీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చదువుకునే ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత వసతిగృహాలను ఏర్పాటు చేసిన సహకారం అందించిన రాజా బహదూర్ వెంకట్రామ్‌రెడ్డిని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని పట్టణంలోనీ అపార్ట్‍మెంట్ ఏరియాలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి పుట్ట మధూకర్ ప్రారంభించారు. అదే విధంగా సంక్షేమ సంఘం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజా బహదూర్ వెంకట్రామ్‌రెడ్డి విగ్రహాన్ని సైతం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. నిజాంకారుల పాలనలో కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఐజీ స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి రాజ బహదూర్ వెంకట్రామ్‌రెడ్డి అని అన్నారు. వెంకట్రామ్‌రెడ్డి కుల, మతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ హైదరబాద్ లాంటి మహానగరం వసతి గృహాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వెంకట్రామ్‌రెడ్డితో పాటు ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వారు ఉన్నారన్నారు. వారందరినీ రెడ్డి వర్గానికి చెందిన వారు ఆదర్శంగా తీసుకోని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తమకు తోచిన సాయం చేయాలని సూచించారు. తాను సైతం తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నానన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఈ నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేశానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నానన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా సైతం మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత ఈ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య కష్టాలు లేకుండా హైదరాబాద్‌లో వసతి గృహాలను ఏర్పాటు చేస్తానన్నారు. ఎలాంటి ఫీజులు లేకుండా వసతి గృహాల్లో విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండవచ్చన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఆనంతరం మండలంలోని నాగారం గ్రామానికి చెందిన శశిరత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఎలక్రిక్టల్ ట్రాక్టర్‌ను తయారు చేయగా ఆయనను పుట్ట మధూకర్, పుట్ట శైలజలు ఘనంగా సన్మానించడంతో పాటు ప్రత్యేకంగా అభినందించారు.