రాజకీయ ప్రయోజనాల కోసమే పాదయాత్రలు
-ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకే భోజన పథకం.
-మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ఎన్నికలలో ప్రజలను మోసం చేసేందుకే రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గ్రామాలలో పాదయాత్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పర్యటించే సందర్భంలో ప్రజలను గతంలో నాగం జనార్దన్ రెడ్డి ఏ ఏ పనులు చేశారని అడిగి తెలుసుకోవాలని సూచించారు.గ్రామాలలో రోడ్లు మంచినీటి ట్యాంకులు పాఠశాల భవనాలు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హయాంలో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి జరిగిందేమీ లేదని ఆయన ఆరోపించారు.రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం వ్యవసాయ భూ పంపిణీ ఆసరా పింఛన్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని తాను ప్రారంభించిన పనులను శంకుస్థాపనల శిలాఫలకాలను తొలగించి రంగులు వేయడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదని ఆరోపించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం స్థలంలో గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే నూతన అతిథి గృహానికి నిధులను మంజూరు చేయడం జరిగిందని దానిపై కన్నువేసిన మర్రి జనార్దన్ రెడ్డి స్థలాన్ని కబ్జా చేసేందుకు భోజన పథకాన్ని ప్రారంభించారని విమర్శించారు.నియోజక వర్గంలోని అన్ని పథకాలలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఆరు నెలల్లో భక్త మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎనిమిది నెలలు అవుతున్నా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని ఆరోగ్యం వ్యవసాయం వ్యక్తిగత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ప్రకటించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ట్రస్టు లావాదేవీలపై ప్రభుత్వ రాయతీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ పథకాల అమలులో సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని తాను రాజకీయాలలో ఎంతో ప్రోత్సహించానని వివిధ పదవులు అందేలా తాను కృషి చేయడం జరిగిందని ఆయన తనను ఓడిస్తానని కంకణం కట్టుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని లేదంటే తమ కుమారుడిని బరిలో నిలుపుతానని అన్నారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి మండల పార్టీ అధ్యక్షులు కోటయ్య మునిసిపాలిటీ అధ్యక్షులు పాండు తెలంగాణ పిసిసి సభ్యులు బాలా గౌడ్ తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ రావు కౌన్సిలర్ నిజాముద్దీన్ నాయకులు తిరుపతి రెడ్డి సత్యం భీముడు అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులలో భూములు కోల్పోయింది రైతులు అని, కమీషన్ లతో లాభం పొందింది మాత్రం కెసిఆర్ కుటుంబం, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే అని విమర్శించారు.