ఎన్ హెచ్ పి ఎస్ అలంపూర్ సమన్వయకర్త క్రాంతిధల్ నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీఎస్ నీళ్ల కోసం ధర్నా
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి);
ఆర్డీఎస్ ద్వారా గతంలో లాగా నీళ్లు వస్తాయని ఆశించిన రైతులకు ఈ ఏడాది నీళ్లు రాక, పంటలు ఎండిపోవడంతో రైతులను ఆదుకోవాలని బుధవారం ఎన్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో వడ్డేపల్లి మండలం రామాపురం ఆర్డీఎస్ కెనాల్ లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ హెచ్ పి ఎస్ అలంపూర్ సమన్వయకర్త క్రాంతిధల్ నాగేష్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా ఊహించినట్లు వర్షాకాలం ప్రారంభంలోనే ఆర్డీఎస్ కింద సాగు చేసే రైతులందరూ పత్తి,మిరప, ఉల్లిగడ్డ, మొక్కజొన్న,వరి పంటలు వేసుకొని లక్ష రూపాయలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే పాలకుల నిర్లక్ష్యం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల నీళ్లు రాకపోవడంతో అలంపూర్ రైతులు బోరున విలపిస్తున్నారు. ఈ పాపం ఎవరిది గత పాలకులు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వైఖరి వల్లే ఈ ప్రాంతం ఎడారిగా మారుతున్నది కేవలం ఎన్నికల ముందు తుమ్మిల ద్వారా నీళ్లు వదిలి రిజర్వాయర్ల కడతామని హామీ ఇచ్చి ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయడం లేదంటే కేసీఆర్ కు నడిగడ్డ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.87,500 ఎకరాలకు అలంపూర్ ప్రాంతంలో ఆర్డీఎస్ ద్వారా నీళ్లు అందాల్సి ఉంటే అది సాధ్యం కాక తుమ్మిళ్ల ప్రారంభిస్తే కేవలం మోటర్లు ప్రారంభించి రిజర్వాయర్లు కట్టకపోవడం వలన ఈరోజు అలంపూర్ రైతుల పాలిట శాపంగా మారింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలంపూర్ ప్రాంతం ఏ విధంగా వెనుకబడిందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కనిపిస్తుంది. ప్రాంతంలో అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు ఎలాగైనా ఆర్డీఎస్ ద్వారా రైతులకు నీళ్లు అందించాలని లేనిపక్షంలో నడిగడ్డకుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులను, అధికారులను హెచ్చరించడం జరిగింది. మరిముఖ్యంగా తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో మల్లమ్మ కుంట, జూలకల్లు, వల్లూరు,మూడు రిజర్వాయర్లు త్వరగా పూర్తిచేసి భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎదురుగా కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ పి ఎస్ సమన్వయకర్త గౌనింటి వీరేష్ వడ్డేపల్లి మండల సమన్వయకర్త బంగారు కిషోర్, నాయకులు నరేష్, రాజ్ కుమార్, నాగరాజు, శివ, అంజి, దామోదర్, కొండల్, రాజు తదితరులు పాల్గొన్నారు.