ఆందోల్ లో జోరుమీద కారు పార్టీ
– గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే క్రాంతి ప్రణాళికలు- దామోదర్ కు అంతు చిక్కని క్రాంతి ప్లాన్- క్రాంతి గెలుపు కోసం పనిచేస్తున్న జైపాల్ రెడ్డి, మఠం బిక్షపతి
జనంసాక్షి, జోగిపేట(మునిపల్లి):వ్యూహ ప్రతివ్యూహలతో క్రాంతి దూకుడు…
ఆందోల్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను రెండో సారి ప్రకటించడంతో మొదటి రోజు నుంచే జోష్ తో ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డి నుంచి అంతారం టెంపుల్ అటు నుంచి వట్పల్లి వెంకట ఖాజా దర్గా వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. అన్ని మండలాల నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల గెలుపు కోసం బూత్ కమిటీలను నియమిస్తూ ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందొ గుర్తించి రివ్యూ చేసుకుంటూ మండల నాయకత్వానికి గైడ్ చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఓటర్ లిస్ట్ లను పంపించి పాత ఓటర్లను చెక్ చేసుకుంటూ కొత్త ఓట్ల నమోదుచేయిస్తూ హుషారుగా ముందుకు సాగుతున్నారు. వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకుల భారీ ఎత్తున చేరుతూ బీఆర్ఎస్ ను బలపరుస్తున్నారు. ఈ సారి తన ప్రత్యర్థి అయినా మాజీ డిప్యూటీ సీఎం దామోదర పై గతంలో కంటే ఎక్కువ మెజారితో గెలవాలని వ్యూహ ప్రతివ్యూహలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కోళ్లగొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తాను గెలిచినప్పటినుంచి జనంలో ఉంటూ వివిధ వర్గాల ప్రజలను ను పార్టీలో చేర్చుకుంటూ క్యాడర్ ను, పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీనితో దామోదర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
క్రాంతికి అండగా జైపాల్ రెడ్డి, బిక్షపతి…
మరోవైపు జిల్లాలో చక్రం తిప్పేనాయకుడిగా పేరున్న జైపాల్ రెడ్డి కూడా ఈ మధ్య అన్ని పంథాలను పక్కన పెట్టి సన్నిహితంగా మెలుగుతుండటంతో 2018లో సీన్ రిపీట్ అవుతుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జాగృతి వ్యవస్థాపకురాలు కవిత సన్నిహితునిగా గుర్తింపున్న బిక్షపతికి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి ఇప్పించడంలో కూడా సక్సెస్ అయ్యి అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అంతకు మించి ఎమ్మెల్యే సోదరులు గతానికి భిన్నంగా బయటకు కనపడకుండా అంతర్గతంగా గెలుపుకోసం సమీకరణాలు చేస్తున్నారు. రాహుల్ కిరణ్ ఇప్పటికే కొన్ని వర్గాలతో పార్టీలతో సంబంధం లేకుండా రహస్య సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇప్పటికే పార్టీలో ఉన్న వివిధ మండలాల అధ్యక్షులతో కూడా గ్రామాల వారీగా సమావేశాలు పెట్టి నాయకుల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గిస్తూ వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే వ్యూహాన్ని రచిస్తున్నట్టు పరిస్థితులను చుస్తే అర్థం అవుతోంది.
అసమ్మతి పేరుతో దామోదర్ కోవర్టులు రాజకీయం…
ఇదంతా ఒక వైపు జరుగుతుంటే అందోల్ లో అసమ్మతి బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత 3 ఏళ్లుగా ఎమ్మెల్యేకు పార్టీకి దూరంగా ఉంటున్న వ్యక్తులు అప్పుడప్పుడు మేము అసమ్మతి అంటూ కొన్ని పత్రికలకు లీకులీస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఏమి ఆశిస్తున్నారో, ఏమికోరుకుంటున్నారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదని కార్యకర్తలు గుణుక్కుంటున్నారు. వారందరికీ పదవులు కట్టబెట్టినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరం వుంటూ మేము కూడా పార్టీ నాయకులనే అసమ్మతి అని బహిరంగంగా చెబుతుంటే పార్టీ నాయకత్వం ఎందుకు ఉపెక్షిస్తుంది అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బలమైన నాయకుడు డిప్యూటీ సిఎంగా చేసిన వ్యక్తి దామోదరను ఎదుర్కోడానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శాయశక్తులా కృషి చేస్తూ, ఒక్కో ఇటుకపేర్చినట్టు పార్టీని బలోపేతం చేస్తుంటే అసమ్మతి అంటూ చెబుతున్న నాయకుల వైఖరి పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నాయకులు కష్టపడుతుంటే దామోదర్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న పుల్కల్ కు చెందిన సంగమేశ్వర్, రాయికోడ్ కు చెందిన శివ కుమార్ లాంటి వ్యక్తులతో కలిసి కొందరు సమావేశాలు పెడుతుంటే వీరిని పార్టీ అసమ్మతి అనేకంటే దామోదర్ కోవర్ట్ లు అనాలని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం దామోదరకు వెన్నతోపెట్టిన విద్య కానీ ప్రతి సారి ఈ వ్యూహం బెడిసికొడుతుంది మల్లి ఈ సారి కూడా అదే తీరుగా వ్యవహరిస్తూ తన పరాజయాన్ని తానే లిఖించుకుంటున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.