కల్లుగీత కార్మికుల మహాధర్నా ను జయప్రదం చేయండి-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
వనపర్తి బ్యూరో సెప్టెంబర్14 (జనం సాక్షి)సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద కల్లుగీత కార్మికుల మహాధర్నా కు వేలాదిగా తరలి రావాలని
తెలంగాణ కల్లుగీత కార్మికులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.గురువారం నాడు
వనపర్తి జిల్లా కేంద్రంలో బండారు శ్రీనివాస్ గౌడ్ బి. రామచంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం, కాళ్ళు చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతుంది. రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు. వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, సేఫ్టి మోకులు ఇవ్వాలని, సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, 2023- 24 బడ్జెట్ లో గీత కార్మికులకు కేటాయించిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 22 (శుక్రవారం) రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గీత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామని అన్నారు.
మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం
నేటికీ అమలు కావడం లేదు. కొద్దిమంది ధనవంతుల చేతుల్లో సంపద కేంద్రీకృతం అవుతుంది. మన వృత్తిదారులను సామాజికంగా చిన్న చూపు చూస్తున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సీట్ల కేటాయింపులో ధనవంతులు, అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనకు పెరగాల్సిన ప్రాతినిధ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. మన సమస్యలు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. చట్టసభలలో మన ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది.
మనం బ్రతుకుతెరువు కోసం వృత్తి ప్రమాదమైనప్పటికీ చేస్తున్నాము. సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారి పడుతున్నారు.వీరిలో
180 మంది చనిపోతున్నారు,
కాళ్లు చేతులు విరుగుతున్నాయి. నడుములు పడిపోతున్నాయి. ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. మనని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ అధ్యక్షులు, మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రమాదాలు. నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, లిక్కర్ షావులు సొసైటీలకు ఇస్తామని తదితర గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాటిని నేటి వరకు అమలు చేయలేదు. ఇటీవల జరిగిన లిక్కర్ షాప్ టెండర్ల లో సొసైటీలకు రిజర్వేషన్స్ కల్పించకుండా పాత పద్ధతినే కొనసాగించారు. మోపెడ్ లు ఇస్తారని గత రెండు సంవత్సరాల నుండి ఆశతో ఎదురుచూస్తున్న మన గీత కార్మికులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియా యధావిధిగా కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు చేయాలి. ఇటివల బిసి కుల వృత్తిదారులకు ఇచ్చిన జీవో నెంబర్ 5 ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించాలి. సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. 2021 డిసెంబర్ 10వ తేదీన కల్లుగీత కార్మిక సంఘం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్. గారు మనం కోరిన విధంగా వృత్తిలో ప్రమాదాలు జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు దహన ఖర్చులకు 25,000 లు, దెబ్బలు తగిలిన వారికి 15,000లు ప్రభుత్వాన్ని ఒప్పించి టాడి కార్పోరేషన్ ద్వారా ఇస్తున్నారు. వీటిని పెంచి ఇవ్వాలని కోరుతున్నాము. 2022 అక్టోబర్ 21వ తేదీన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలో వారు సేఫ్టీ మోకు డెమో ఇప్పించారు. ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. 2023-24 లో గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.వెంటనే విడుదల చేయాలి…
పైడిమాండ్లు పరిష్కారం చేయాలని 2023 జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు. వేలాదిమంది గీత కార్మికులతో ధర్నాలు నిర్వహించాము. ప్రభుత్వం కొన్ని కంటి తుడుపు చర్యలు చేపట్టింది తప్ప ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయి. అందుకని ప్రభుత్వం పై వత్తిడి పెంచేందుకు ఈ మహాధర్నాకు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో, పి రమేష్ గౌడ్ ,ఈ సురేష్ గౌడు, పి కృపానందం గౌడ్ ,బి రామన్ గౌడు, కే కృష్ణయ్య గౌడ్, జి రాజు గౌడ్ ,ఎస్ వెంకట స్వామి, బాలరాజు గౌడ్, ఏ బాల గౌడు, జి నరేష్ గౌడ్ ,ఎస్ మోహన్ గౌడ్, కురుమూర్తి, ఎం వెంకటేశం గౌడ్, సి కురుమూర్తి గౌడ్, పల్సం రామన్ గౌడ్, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు