సరైన ఆధారాలతోనే ఓటరు జాబితా లో మార్పులు చేర్పులు చెయ్యాలి-ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ భారతీ లక్పతి నాయక్

-బల్క్ అర్జీలకు అవకాశం ఇవ్వవద్దు

-రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలి

-వనపర్తి బ్యూరో సెప్టెంబర్14 (జనం సాక్షి)ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్ అబ్జర్వర్‌ భారతి లక్పతి నాయక్ అన్నారు.గురువారం ఆమె వనపర్తి జిల్లాలో పర్యటించారు. వనపర్తి సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ఆమె తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించేది ఓటు హక్కు మాత్రమే అన్నారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2023 ఓటరు జాబితాను సిద్ధం చేయడానికి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్‌ ప్రకారం అన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌లెవల్‌ ఏజెంట్లను నియమించి ఓటరు నమోదు 100 శాతం సక్రమంగా జరిగేలా భాగస్వాములు కావాలని సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అక్టోబర్ మాసంలో తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని అన్నారు.ఒకేసారి ఇచ్చే బల్క్ అప్లికేషన్లను ఎట్టి పరిస్థితులలో అనుమతించకూడదని డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని సూచించారు.
ఓటర్ జాబితాలోని ఎదైన పేరు తొలగింపుకు అవసరమైన రుజువు పత్రాలు తప్పనిసరిగా ఉండాలని రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. స్థానిక రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటరు జాబితా లో చేర్పు మార్పులపై సరైన సమాచారం ఇచ్చి అధికారులకు బిఎల్ఓ లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ తన ప్రక్రియను అంతా పారదర్శకంగా ఉంచుతుందని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జనాభా ప్రాతిపదికన ఓటరు నమోదులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల 19వ తేదీ వరకు మాత్రమే సమయం ఉన్నందున అర్హత ఉన్న వారు ఏ ఒక్కరూ మిగిలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుర్తించిన లోపాలు అన్నింటిని సరి చేసుకోవడానికి రిటర్నింగ్ అధికారిని సద్వినియోగం చేసుకోవాలని తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారందరూ సెలవులపై వెళ్లే అవకాశం లేదని అందుకు అనుమతించలేమని సూచించారు. ఆర్వో, ఏఈఆర్వోల స్థాయిలో పెండింగ్ లు లేకుండా చుసుకిలోవలని అన్నారు.నియోజకవర్గంలోని 128వ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఓటర్ల జాబితా చేర్పులు మార్పులపై ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు ఇకముందు తీసుకునే చర్యలు వివరించాలని సూచించారు.ఇందుకు సమాధానం ఇచ్చిన బి.ఎల్. ఒ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికి సర్వే చేసి 18 సంవత్సరాలు నిండిన యువతను కొత్తగా వివాహమై వచ్చిన వారిని విద్యార్థులను ఎప్పటికప్పుడు కలుసుకొని సంబంధించిన ఫారంలు నమోదు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి ఫోన్ నంబర్ల ద్వారా వారిని సంప్రదిస్తున్నామని 128వ బూత్ అధికారి వివరించారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఇప్పటి వరకే చాలా కృషి చేశారని ఈ సమాధనం ద్వారా స్పష్టం అవుతుందని జిల్లా కలెక్టర్ ను బి.ఎల్. ఒ ను అబ్జర్వర్ అభినందించారు.పోలింగ్ స్టేషన్ లొకేషన్ పేరులో కొన్నిచోట్ల ఎస్సీ కాలనీగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, బహుజన సమాజ పార్టీ నాయకులు కోరారు.
పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో మరణించిన 40 మంది ఓటర్లు ఉన్నారని వారిని తొలగించాలని గ్రామ ప్రతినిధి కొండారెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ మారుమూల ప్రాంతాల పోలింగ్ స్టేషన్లో పలుమార్లు తనిఖీలు చేస్తున్నారని తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడానికి చాలా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామాల్లో పౌరులు అందుబాటులో ఉంటారని ఆ సమయం లో విచారణలు చేయాలని కోరారు .సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు లక్ష్యంతో క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ రోల్ అబ్జర్వర్ కు వివరించారు. ఓటరు నమోదులు పెంచడానికి తప్పనిసరిగా ఓటు వేయాలని లక్ష్యంతో జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పటికే ఐదు కిలోమీటర్ల పరుగు తోపాటు కళాశాలలో 18 ఏళ్లు నిండిన యువతకు అవగాహన కల్పించడానికి తనతో పాటు జిల్లా అధికారులకు అందరికి బాధ్యతలు అప్పగించామన్నారు. స్వయం సహాయక బృందాలచే అవగాహన కల్పిస్తూ చైతన్య పరచటానికి రంగోలి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహకంగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. బైక్ ర్యాలీ, ట్రేకింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించామని అన్నారు.
ఘనపురం మండలం మామిడి మాడ, మామిడి మాడ తాండ లలో ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్కు ఓటర్లను మార్చే ప్రక్రియ ఫారం 8 ద్వారా చేస్తున్నామని వివరించారు. తమ పరిధిలో 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని ధ్రువీకరణ ఇచ్చే బాధ్యతను సంబంధితలపై ఉంచామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, ఆర్డిఓ పద్మావతి నియోజకవర్గంలోని తాసిల్దారులు నాయక్ తహసిల్దారులు బిఎల్వోలు బిఎల్వోల సూపర్వైజర్లు సి సెక్షన్ సూపర్డెంట్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు