గణేష్ ఉత్సవాలు నిమజ్జనం ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలి
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 14(జనంసాక్షి)
గణేష్ ఉత్సవాలు నిమజ్జనం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం ఐడిఓసిలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం కార్యక్రమాలపై ఎస్పీ చంద్రశేఖర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ ఉత్సవాల నిర్వహణ కొరకు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీస్ విద్యుత్ శాఖల ముందస్తు అనుమతులు పొందాలన్నారు. నవరాత్రులు కొనసాగే ఉత్సవాలలో ఎటువంటి అవాంతరాలు వాటిల్లకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు బాధ్యత వహించాలని వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు కాలువలు వద్ద పరిరక్షణకు సిబ్బంది కి విధులు కేటాయించాలన్నారు. చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ముందస్తుగా తొలగింప చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనంలో గజ ఈత గాళ్లను మాత్రమే నియమించాలని మత్స్య శాఖ అధికారిణి ని ఆదేశించారు.
పోలీస్ శాఖ క్రేన్ తోనే విగ్రహాలను నిమజ్జనం చేయించాలన్నారు. కేసముద్రం, దంతాలపల్లి మండలాలపై దృష్టి పెట్టాలని డి.పి.ఓ.ను ఆదేశించారు.నెల్లికుదురు, కేసముద్రం,గూడూరు మండలాలలో తప్పకుండా క్రేన్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక , విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య శాఖ అధికారులు శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.