ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం

– బొక్కలవాగుపై వంతెన నిర్మాణానికి 50 ఏండ్లు పడ్తుందా..? – ప్రభుత్వం ఒకటి ఎమ్మెల్యే ఒకరు ఉంటే అభివృధ్ది జరుగదు
– ఓడినా ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు పుట్ట మధూకర్‌
– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
జనంసాక్షి, మంథని : ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరుతో బూటకపు ఇండ్లు నిర్మించి ఈనాటికి గొప్పలు చెప్పుకుంటున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. మంథని పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో మంథని, రామగిరి, ముత్తారం,కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన గృహలక్ష్మి లబ్దిదారులకు జెడ్పీ చైర్మన్‌లు పుట్ట మధూకర్‌, జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ లతో కలిసి ఆయన లబ్దిదారులకు ప్రొసిడింగ్‌ కాపీలను మరియు వ్యవసాయ అప్పులు మాఫీ అయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 61200ఇండ్లు మంజూరీ చేసినట్లు చెబుతున్నారని, ఇన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే మళ్లా ఇంత మంది గృహలక్ష్మికి ఎందుకు దరఖాస్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు పదేండ్లు, అంతకు ముందు సుమారుగా 40 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయలేదన్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి గొప్పగా అభివృధ్ది, సంక్షేమం చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏనాడు అడుగులు వేయలేదని విమర్శించారు. ఇప్పటికి ఎంతో మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇండ్లు లేక, భూములు లేక అవస్థలు పడుతున్నారంటే అందుకు కారకులెవరో అర్థం చేసుకోవాలన్నారు. ఈనాడు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, ఈ క్రమంలో జిల్లాలో 25వేల ఇండ్లు మంజూరీ చేస్తూ రూ.250 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మంథని నియోజకవర్గానికి 1500ఇండ్లకు రూ.40 కోట్లు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.3 లక్షల మంజూరీ చేస్తున్నా చిన్న మొత్తంగానే కన్పిస్తుందని, కానీ నియోజకవర్గం, జిల్లా స్థాయిలో చూసుకుంటే పెద్ద మొత్తమని ఆయన వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని గొప్పగా ఆలోచన చేసేది కేవలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం అంటేనే రైతులు భయపడాల్సిన పరిస్థితులు ఉండేవని, కరెంటు, నీళ్లు, ఎరువుల కోసం నానా కష్టాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈనాడు ఎక్కడ చూసినా 24 గంటల కరెంటు, ఎడతెరపి లేని సాగునీరు, అందుబాటులో ఎరువులు అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా పంట సాగుకు పెట్టుబడి సాయం అందిస్తూ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కళ్యాణలక్ష్మి, పెన్షన్‌, కేసీఆర్‌ కిట్‌ ఇలా ఏదో ఒకటి అందుతుందని ఆయన అన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామ రూపు రేఖలు మారిపోయాయని, ఈనాడు స్మశాన వాటిక, నర్సరీ, డంపిండ్‌ యార్డు లేని గ్రామం లేదన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఏ రకమైన సౌకర్యాలు అందించాలో ప్రక్షాళన చేసి పల్లె ప్రగతి ద్వారా అభివృధ్దకి బాటలు వేశారన్నారు. మన బిడ్డల చదువుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పారని, ఆడబిడ్డ కాన్పు తల్లిదండ్రులకు బారం కావద్దని మాతా శిశు ఆస్పత్రులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వ దావఖానాలో ఎలాంటి వైద్యం అందేదో గుర్తు చేసుకోవాలని, ఒక్క ఆడబిడ్డ కాన్పు జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి కొత్త పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక ఆ పథకాలపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలో ప్రజలు భరించారే తప్ప ఏదో చేస్తరని నమ్మకం వారిలో లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు 48లక్షల మందికి వివిధ రూపాల్లో పెన్షన్‌లు అందిస్తున్నామని, ఆనాడు పెన్షన్‌ మంజూరీ కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలని, పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క రూపాయి పెన్షన్‌ పెంచని చరిత్ర కాంగ్రెస్‌దే అన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన అందించిన కాంగ్రెస్‌ పాలకులకు బొక్కలవాగుపై వంతెన నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందని, వంతెన నిర్మాణానికి 50ఏండ్లు పట్టిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒకటి ఉండి ఎమ్మెల్యే మరొకరు ఉంటే అభివృధ్ది సాధ్యం కాదని, ఈనాడు మంథనిలో అలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. ప్రభుత్వంలో లేని వారికి అవకాశం కల్పిస్తే తట్టెడు మట్టి పోసే వాళ్లు ఉండరని ఆయన అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి పనిచేసే సత్తా ఉన్నా సేవా గుణం ఉన్న పుట్ట మధూకర్‌కు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించారని, ఆ అవకాశం కల్పించడం మూలంగానే ఈనాడు మంథనికి వేల కోట్ల అభివృద్ది పనులు మంజూరీ అయ్యాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల గురించే ఆలోచన చేశాడని, ఏనాడు ప్రజలను దూరం చేసుకోలేదని, అలాంటి నాయకుడిని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని కాపాడుకోవాలని, అలా కాపాడుకోకుంటే ఆ ప్రాంతానికి, ప్రజలకే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.