262 అక్రమ కట్టడాలు నేలమట్టం

` వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం
` ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
` ఇక తదుపరి మూసీ ఆక్రమణలపై దృష్టి
హైదరాబాద్‌(జనంసాక్షి):అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిరచింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది.రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అవిూన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడిరచింది. అత్యధికంగా అవిూన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.
ఇక తదుపరి మూసీ ఆక్రమణలపై దృష్టి
రాష్ట్రంలో హైడ్రా దూసుకుపోతోంది. ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు చేసింది కొంతే అయినా..హైడ్రా పనితీరుకు ప్రజల్లో మంచి పేరు వస్తోంది. ఆక్రమణలు కూల్చాల్సిందేనని అంటున్నారు. రాజకీయనేతలు, రియల్టర్ల ఆక్రమణలు తొలుత కూల్చాలని కోరుకుంటున్నారు. నాలాలను ఆక్రమించిన వారు ఎవరైనా ఊరుకోవద్దని ప్రజలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మూసీ డెవలప్‌మెంట్‌ కోసం సిఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మూసీ ఆక్రమణలపై హైడ్రా దృష్టి పెడుతుందని అంటున్నారు. మూసి ఆక్రమణల తొలగింపు హైడ్రా తదుపరి టార్గెట్‌గా ఉంది. ఈ వారాంతంలో మూసి వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. మూసిలో ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది. మూసి ఆక్రమణల తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత 15 ఏళ్ళలో మూసి ఎప్టిఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మాణాలు భారీగా వెలిశాయి. ఇప్పటికే చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ మూసి ఆక్రమణలకు పాల్పడ్డ వారికి నోటీసులు జారీ అయ్యాయి.అర్హులైన బాధితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మూసి ఆక్రమణలపై ప్రభుత్వానికి హైడ్రా సమగ్ర నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. మూసిలో 10 వేలకు పైగా ఇళ్ళు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే కొందరు మూసీలో మట్టి నింపి ఆక్రమించి వ్యాపార సముదాయాలు కట్టారు. గండిపేట నుంచి మొదలు నాగోల్‌ వరకు అనేక చోట్ల ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నారు. మరోవైపు చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి సిª`దందగా ఉన్నారు. రెవెన్యూ, ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కిందిస్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేం దుకు అభ్యంతరాలు లేవని న్యాయ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లింది. ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి చేరనుంది. ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, రోడ్లు`భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కనున్నాయి. దీంతో ఇక హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా మరింద దూకుడు ప్రదర్శించనుంది. మూసీ పరివాహకం క్లీన్‌ కానుంది. అలాగే చెరువులకు విముక్తి దక్కనుంది.