28 సాయంత్రమే తుది గడువు
ప్రకటన రాకపోతే మిలిటెంట్ తరహా పోరాటం
గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్ భూస్థాపితం
ఆజాద్ కొత్త క్యాలెండర్ కనిపెట్టిండు
వరంగల్, జనవరి 24 (జనంసాక్షి) :
తెలంగాణపై భిన్న ప్రకటనలు.. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు.. చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజ మండిపడుతోంది. కాంగ్రెస్ తన దుర్మార్గపూరిత వైఖరిని మరోసారి తమపై రుద్దాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్యాకేజీలు, పొట్లాలు అవసరమే లేదని తేల్చి చెబుతోంది. ఈపారి తెలంగాణకు ఎవరడ్డొచ్చినా తమ తడాకా చూపుతామని తేల్చిచెబుతోంది. గురువారం తెలంగాణపై అడ్డంగా మాట్లాడిన ఆజాద్ దిష్టిబొమ్మను తెలంగాణ వ్యాప్తంగా దహనం చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆయన తీరుపై నిప్పులు చెరిగారు. ముందుగా ప్రకటించినట్లుగా తెలంగాణపై తేల్చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 28 సాయంత్రమే తుది గడువని
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. గురువారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నెలంటే 30 రోజులే కాదంటూ ఆజాద్ కొత్త క్యాలెండర్ కనిపెట్టండని ఎద్దేవా చేశారు. గడువంటే గడువుకే కట్టుబడాలని, అటూ ఇటూ అయ్యేప్పుడు నెల రోజుల గడువు ఎందుకు విధించారో కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెప్పాలని డిమాండ్ చేశారు. ఆజాద్ సీమాంధ్ర పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉండి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడాడని, ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. గుప్పెడు మంది పెట్టుబడిదారుల వెంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. గడువులోగా తెలంగాణ రాకుంటే మిలిటెంట్ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఎప్పుడూ శాంతంగా మాట్లాడే కోదండరామ్ ఆజాద్, కాంగ్రెస్‌పై తీవ్రస్వరంతో నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకుంటే గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఉద్యమిస్తామన్నారు. ప్రజలతో కలిసి తాము సాగించబోయే ఉద్యమంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. 27న నిర్వహించే సమరదీక్షకు ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేసే కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు రోజుల గడువుందని దీనిని సద్వినియోగం చేసుకొని తెలంగాణ ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అధిష్టానం తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.