29న గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే దొరబాబు

రాజమండ్రి,జూలై23(జనంసాక్షి): గొల్లప్రోలు పట్టణంలో ఈనెల 29వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణ శివారులోని ప్రైవేటు లేఅవుట్‌ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు వీలుగా చదును, ఎత్తు చేసే పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో నిలిచిపోయిన వర్షపునీటిని తొలగించి క్వారీ డస్ట్‌ వేశారు. సభకు అడ్డంకిగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించారు. వేదిక నిర్మాణపనులు జరుగుతున్నాయి. పనులను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సవిూపంలోని హెలీపాడ్‌ వద్ద పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఆవరణలో నాడు నేడు పనులు నిమిత్తం వేసిన ఇసుక, ఇతర సామాగ్రి హెలికాప్టర్‌ దిగే సమయంలో అడ్డంకిగా ఉండే అవకాశం ఉందని పరిశీలించాలని జిల్లా కలెక్టరు అధికారులకు సూచించారు. డీఈవో పాఠశాలకు చేరుకుని వాటిని పరిశీలించారు. వీటివలన ఎటువంటి అడ్డంకి ఉండదని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు
పట్టణంలో 29వ తేదీన జరగనున్న సీఎం పర్యటనను అడ్డుకుని నిరసన తెలుపుతామని మాలమహాగర్జన అధ్యక్షుడు దానం లాజర్‌బాబు చెప్పారు. పిఠాపురం పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమానికి సంబంధించిన 28 పథకాలను రద్దు చేశారని తెలిపారు. దళితులకు చేసిన అన్యాయంపై దళితవాడల్లో పాదయాత్ర నిర్వహించి అవగాహన కల్పించామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం, దళితులపై దాడులు పెరగడం తదితర అంశాలపై తమ నిరసన తెలిపేందుకు ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవాలని భావిస్తున్నామని వివరించారు.

తాజావార్తలు