29న టిడిపి వ్యవస్థాపక దినోత్సవం

కరీంనగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ స్థాపించి 33 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 29న జిల్లావ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు  తెలిపారు.  నియోజకవర్గకేంద్రాల్లో, గ్రామ, మండల, జిల్లా కేంద్రంలో పార్టీ పతాకావిష్కరణ, ద్విచక్రవాహనాల ర్యాలీ, రక్తదానం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. శాసనసభ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలకు భయపడే పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని విజయరమణారావు ఎద్దేవా చేశారు. జాతీయగీతాన్ని అవమానపర్చినట్లేయితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. సమస్యలపై చిత్తశుద్ది కొరవడిందన్నారు. సీఎం తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో చేనేత కార్మికులు నిరాహారదీక్షలు చేస్తున్నా స్పందించడం లేదని, కనీసం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. బీడీ కార్మికులకు పింఛను అని చెప్పి జీవోల్లో కొర్రీలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో, జిల్లాలో తీవ్ర కరవు ఇబ్బందులు ఉన్నా.. కనీసం చర్చించడం లేదని  విమర్శించారు. 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 93 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించడం దారుణమన్నారు. జిల్లాలో రైతులు వేసుకున్న పంటలు మొత్తం ఎండిపోయాయని, కనీసం జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా పాలనాధికారి పర్యటించి పంట నష్టంపై అంచనాలు కూడా వేయడం లేదని రుణాలను రీషెడ్యూలు చేయడం లేదన్నారు. తక్షణమే జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.