సుప్రీం ఆదేశాల మేరకేనన్న ఉన్నత విద్యా మండలి
హైదరాబాద్: ఎట్టకేలకు ఎంసెట్‌లో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియలో ఒక ముందడుగు పడింది. ఈనెల 31వ తేదీన ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేయాలని సోమవారం జరిగిన ఉన్నత విద్యా మండలి అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయాల మేరకు వచ్చేనెల ఏడవ తేదీన విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించాలని నిర్ణయించారు.మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్ గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వచ్చేనెల ఏడవ తేదీలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కౌన్సిలింగ్ ప్రక్రియపై చర్చిస్తామని విద్యామండలి పేర్కొంది.ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు అక్టోబర్ వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 23వ తేదీన సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. తాము కౌన్సిలింగ్ నిలిపివేయాలని ఆదేశాలివ్వలేదని ఈనెల 23వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 1956కు ముందు తెలంగాణలో స్థిర పడిన వారికి మాత్రమే బోధనా ఫీజు చెల్లిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిపై వివాదం నెలకొనడంతో వివిధ కోర్సుల్లో కౌన్సిలింగ్ తేదీల నిర్ణయంపై సందిగ్ధత నెలకొంది. స్థానికత, ఫీరీయింబర్స్‌మెంట్‌పై నెలకొన్న వివాదంతో ఎంసెట్, ఐఎస్, పాలిసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోయాయి. ప్రతి ఏడాది ఆగష్టు మొదటి వారంలో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సిలింగ్‌లు జరగకపోవడంతో విద్యార్థులు ఆందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే.