34 శాఖల సేవలు ..
ఒకే వేదికపైకి తీసుకొచ్చాం
– ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్
అమరావతి, జులై19(జనం సాక్షి) : ప్రజలకు మేలైన పరిపాలన అందించేందుకు 34 శాఖల సేవలు ఒకే వేదిక పైకి తీసుకొచ్చామని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ-ప్రగతి పథంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడలో వివరించారు. ఈ – ప్రగతి ప్రజల సేవలకు ముందు వరుసలో ఉండే ఒక కార్యక్రమమని.. కనిపించే ప్రభుత్వ సేవలు, కనిపించని ప్రభుత్వం విధానంలో మెరుగైన పౌర సేవలు అందించగలుగుతామని స్పష్టం చేశారు. ఈ- ప్రగతి పథంలో ఆధార్ సంఖ్య వినియోగం అత్యంత ప్రామాణికంగా నిలవనుందని తెలిపారు. కేవలం ప్రభుత్వ పౌర సేవలతో కాకుండా ఇతర సేవలకు కూడా దీన్ని వేదికగా రూపకల్పన చేశామన్నారు. యువతకు మెరుగైన అవకాశాలు అందించి పారిశ్రామిక వేత్తలుగా రూపుదిద్దేలా తీర్చిదిద్దుతామన్నారు. చాలామంది వారి డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా ఎలా రెన్యూవల్ చేసుకోవాలో తెలియక ఆసక్తి చూపరని.. అలాంటి సేవలు అందించగలిగితే
ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఆగస్టు నెలలో నిరుద్యోగ యువతకు చేయూతను అందించే నిరుద్యోగ భృతి కార్యక్రమం అమల్లోకి వస్తుందని.. దీనికోసం రిజిస్టేష్రన్ పక్రియను చేపడుతున్నట్లు లోకేశ్ వెల్లడించారు.