40లక్షల మందికి దక్కని చోటు

– జాతీయ పౌర రిజిస్టర్‌ ముసాయిదాను విడుదల చేసిన అసోం ప్రభుత్వం
– కేవలం ఇది డ్రాప్ట్‌ మాత్రమే.. తుది జాబితాకాదు
– స్పష్టం చేసిన అధికారులు
– ముసాయిదాలో లేనివారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించబోం
– వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమన్న ప్రభుత్వం
– నమోదు కానివారు ఆగస్టు7 నుంచి స్థానిక రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని సూచన
గువాహటి, జులై30(జ‌నం సాక్షి) :  అసోంలో స్థానిక, స్థానికేతరులను గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్ర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎంఆర్‌సీ) ముసాయిదాను విడుదల చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్‌ఆర్‌సీ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్‌ఆర్‌సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా తెలిపారు. మొత్తం 3.29కోట్ల మందికిగానూ 2,89,83,677 మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. దీంతో దాదాపు 40లక్షల మందికి పౌరసత్వం లభించకుండాపోయింది. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమేనని.. తుది జాబితా కాదని అధికారులు స్పష్టం చేశారు. ముసాయిదాలో లేని వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించబోమని తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని.. నిర్బంధ గృహాలకు తరలించబోమని చెప్పారు. అంతేగాక వారు భారతీయులుగా నిరూపించుకునేందుకు మరో అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదాలో పేరు ఎందుకు నమోదు కాలేదో తెలుసుకోవాలంటే ఆగస్టు 7నుంచి స్టానిక రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లి సంప్రదించాలని తెలిపారు. పేరు లేని వారు తమ అభ్యంతరాలను ఆగస్టు 30 నుంచి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ పౌర రిజిస్టర్‌ విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కేంద్ర బలగాలనూ రప్పించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నామని.. ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని పోలీసులు తెలిపారు. అసోంలో భారత పౌరుల కంటే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ వాసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ జాతీయ పౌర రిజిస్టర్‌ పక్రియ చేపట్టింది అక్కడి ప్రభుత్వం. 1.5కోట్ల మందితో గతేడాది తొలి జాబితాను విడుదల చేసింది. అయితే అందులోనూ 15లక్షల మందికి సంబంధించి పత్రాల్లో వైరుధ్యాలు ఉండటంతో వారిని జాబితా నుంచి తొలగించనుంది. తాజాగా మరో 2.89కోట్ల మందితో ముసాయిదాను ప్రకటించింది.