42% రిజర్వేషన్ సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు

` బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం
` బీసీ జేఏసీ చైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్
` రిజర్వేషన్ల సాధన కోసం 18న బంద్ ఫర్ జస్టిస్ పేర రాష్ట్ర బంద్
` 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా
` బీసీల నిరసనను గల్లీ నుంచి ఢల్లీి దాకా సెగ పుట్టిస్తాం
` బీసీ జేఏసీ ఆవిర్భావం సందర్భంగా నేతల వెల్లడి
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఎవరికివారుగా కాకుండా ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బీసీ జేఏసీ ఏర్పాటైంది. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు ఆదివారం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా కూడా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రముఖంగా ఉద్యమించే బీసీ సంఘాలు సమావేశమై తమతమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో బీసీ జేఏసీ ఏర్పాటు ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా విజిఆర్ నారగోని, కో చైర్మన్లుగా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణను ఎన్నుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈ నెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి, అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. జరిగిన అన్యాయంపై బీసీలంతా రాజకీయ పార్టీలకతీతంగా ఏకమై పోరాడాలని, అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని అన్నారు. ఇప్పటి బీసీ రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభలు, బీసీలకు రిజర్వేషన్లు వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలను ఐక్యంగా లేరని, బీసీలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18న బంద్ ద్వారా బీసీల బలమేందో చాటుతామన్నారు. సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 బీసీ కుల సంఘాలతో పాటు ముఖ్యంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రం గౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపేష్ సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్లయ్య, రాజేందర్, పగిల సతీష్, రామ్మూర్తి, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.
దోస్తులెవరో.. ద్రోహులెవరో 18న తేలుతుంది : జాజుల శ్రీనివాస్ గౌడ్
42 శాతం బీసీ రిజర్వేషన్‌కు ఏ ఒక్క రెడ్డి సంఘం మద్దతు ప్రకటించలేదు. రాష్ట్రంలో 136 కులాలు, 60 శాతం జనాభాగా ఉన్నది బీసీలే. తెలంగాణలోని రెడ్ల ఆధిపత్యాన్ని పాతరేసేందుకే బీసీ జేఏసీ ఏర్పాటైంది. రెడ్లను బీసీలు ముఖ్యమంత్రులను చేస్తే.. రెడ్లు మాత్రం బీసీలను కనీసం సర్పంచులు కూడా కాకుండా అడ్డుకుంటున్నారు. తెలంగాణ గడ్డ మీద బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసే దాకా బీసీ జేఏసీ పనిచేస్తుంది. తెలంగాణ బంద్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతివ్వాలి. 18న బీసీలకు దోస్తులెవరో, ద్రోహులెవరో తేలిపోతుంది. ఆత్మగౌరవ ఉద్యమాన్ని పిడికిలి బిగించి అగ్గి రాజేస్తే బంద్ సెగ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వరకు తాకాలి.