50 ఏళ్ల వరకు ఆడతానేమో..!

కోల్‌కతా: క్రికెటర్‌కు 35 ఏళ్ల వయసొచ్చిందంటే అతడి కెరీర్‌ చరమాంకంలో ఉన్నట్టే. 40 ఏళ్లు వచ్చాయంటే సాధారణంగా అతడు మైదానంలో కనిపించడు. వ్యాఖ్యాతగానో, కోచ్‌గానో మారిపోతాడు! 40 కాదు 45 ఏళ్లొచ్చినా ఓ ఆటగాడు ఇంకా మైదానంలో ఉత్సాహంగా పరుగెడుతున్నాడు.. మిగతావారితో పోటీపడి వికెట్లు తీస్తున్నాడు. ఆ ఒక్కడు ఆస్ట్రేలియా స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ చాలా చురుగ్గా కనిపిస్తున్న హాగ్‌ ఇంకెంత కాలం క్రికెట్‌ ఆడతాడనే దానిపై జోరుగానే చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని హాగ్‌ను అడిగితే.. వీలైనంత ఎక్కువ కాలం ఆడతానంటున్నాడు. ‘‘నేను ఇప్పటివరకు ఆడుతున్నానంటే కారణం నా భార్యే. క్రికెట్‌కు నేను వీడ్కోలు పలకడంపై చర్చ మొదలైన ప్రతీసారి.. ఆమె మరింత ఎక్కువ కాలం ఆడేలా నన్ను ప్రోత్సహిస్తుంది. బహుశా ఇలాగే 50 ఏళ్లు వచ్చే వరకు ఆడతానేమో’’ అని హాగ్‌ అన్నాడు. కోల్‌కతా తరఫున ఐపీఎల్‌ ఆడుతున్న హాగ్‌ దిల్లీతో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుకు మరో మూడేళ్లు ఆడే అవకాశమున్నా.. 2008లో రిటైరైనందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని హాగ్‌ చెప్పాడు. ‘‘కుటుంబ సమస్యల కారణంగానే అంతర్జాతీయ క్రికెట్‌కు త్వరగా వీడ్కోలు పలకాల్సి వచ్చింది. మొదటి పెళ్లి ఎక్కువ కాలం నిలవక పోవడంతో మానసికంగా కుంగిపోయాను. కొత్త భాగస్వామితో నా జీవితం మారిపోయింది. ఆమె నాకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటుంది’’ అని హాగ్‌ వివరించాడు.