6న టిడిపిలో చేరనున్న కొండ్రు
శ్రీకాకుళం,సెప్టెంబర్3(జనం సాక్షి): మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6గటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఆయన తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందింది. వాస్తవానికి ఆగస్టు 31వ తేదీనే తెదేపాలో కోండ్రు చేరాల్సి ఉంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆగస్టు 29వ తేదీన రహదారి ప్రమాదంలో మృతి చెందటంతో కోండ్రు చేరిక వాయిదా పడింది. నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం పట్టణంలోని నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే కోండ్రు సమావేశమయ్యారు. గతం నుంచి తనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అవే వేదికలపై తాను తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో సీఎం సమక్షంలో చేరిక కార్యక్రమానికి అందరూ తరలిరావాలని కోరారు. ఈ మేరకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.