హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండానే తెలంగాణ బిల్లు!రాజధానిపై పదేళ్లపాటు గవర్నర్‌ పెత్తనం

ఇరుప్రాంతాల ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే యోచన

డిసెంబరు9లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రయత్నాలు

న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో కేంద్రం మంతనాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 : హైదరాబాద్‌ అంశం లేకుండానే తెలంగాణ బిల్లు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌, సీడబ్ల్యుసీ తీర్మానం మేరకు పదేళ్లపాటు ఉమ్మడిరాజధానిగా అని పొందుపరుస్తూనే ఈ పదేళ్ల పాటు హైదరాబాద్‌కు సంబంధించి అధికారాలు, శాంతిభద్రతల తదితర అంశాలు ఎవరి చేతిలో ఉండాలనేది బిల్లు తర్వాత నిర్ణయిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రమంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇంకా కమిటీ ఇరుప్రాంతాల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం మార్గం చూపుతోంది. నీరు, నిధులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆప్షన్లు, రాజధాని తదితర అంశాలను అందరితో చర్చించి పంపకాలు చేస్తోంది. వాస్తవంగా గతంలో ఎన్డీఏ  ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సందర్భంగా బిల్లునే అన్ని అంశాలను పొందుపర్చింది. అయితే, తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకున్న అనంతరం ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. సీమాంధ్రలో పెరిగిన ఉద్యమం ఆ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బెదిరింపులు తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం సీడబ్ల్యుసీలో తీర్మానం చేసిన విధంగా కాకుండా హైదరాబాద్‌ అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా పాటించిన విధివిధానాలను సైతం పాటించకుండా కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలంటుకుంది. విభజన బిల్లులో రాజధాని అంశాన్ని ప్రస్తావించకుండా ఇందుకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా అనంతరం ఏర్పాటయ్యే మంత్రివర్గ కమిటీచే అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. హైదారాబాద్‌ను పదేళ్లపాటు ప్రత్యేకమైన ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ప్రస్తుతానికి రాజ్యాంగపరంగా వీలుకాదు. ఉమ్మడి రాజధాని అంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదు. ఢిల్లీతరహాల్లో రాష్ట్రఏర్పాటును టీఆర్‌ఎస్‌, బీజేపీ అంగీకరించడం లేదు. దీంతో అధికారాలన్నీ కేంద్ర పర్యవేక్షణలో ఉంచి పదేళ్లపాటు గవర్నర్‌ చేతిలో అధికారం ఉంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులతో కేంద్రం ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం తీసుకుంటే ఇరుప్రాంతాల ప్రజలను కొంత ఊరట పరచవచ్చని ఇదే సందర్భంలో సీమాంధ్ర కొత్త రాజధాని పేరుకూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వరంగ విద్యాసంస్థలు, కార్యాలయాలు, రక్షణ సంస్థల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల కూడా సాధించి ఈ పదేళ్లలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. ఎలాగైనా సమస్యను పరిష్కరించి డిసెంబరు 9వ తేదీలోగా ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.