సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలకు షాక్‌

మాట్లాడేందుకు ఇష్టపడని దిగ్విజయ్‌సింగ్‌
సీఎం, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయిన ఎంపీలు
రాజీనామాలపై పునరాలోచన!
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం చాలా కచ్చితంగా వ్యహరిస్తోంది. విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ షాక్‌ ఇచ్చారు. వారు కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కలిసేది లేదంటూ తేల్చడంతో ఎంపీలు నివ్వెరపోయారు. ఇప్పటికే రాజీనామాలు చేస్తామని గతంలో దిగ్విజయ్‌ చెప్పగా.. చేస్తే చేసుకోండి, ఇక నాతో పనేముంది అంటూ ఘాటుగా చెప్పిన విషయం విదితమే. సీమాంధ్ర మంత్రుల సతీమణులు కూడా దిగ్విజయ్‌ కటువుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఢిల్లీలోనే ఉన్న సీమాంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, హర్షకుమార్‌, సాయిప్రతాప్‌, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు తదితరులు భేటీ అయ్యారు. అయితే, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి, లగడపాటి మాత్రం హాజరుకాలేదు. అయితే తొందరపడి రాజీనామా చేయవద్దని సీఎం తమను కోరినట్లు సమావేశం అనంతరం హర్షకుమార్‌ విలేకరులతో తెలిపారు. చేస్తే అందరం కలిసి రాజీనామా చేద్దామని, నిర్ణయం రాకముందే రాజీనామాలు సమర్పించడం ఎందుకంటూ సీఎం వారికి సర్దిచెప్పారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన అంశం చర్చకు వచ్చే సమయంలో మాట్లాడేందుకు సభలో ఎంపీలు ఉండకపోతే సీమాంధ్రకే నష్టమంటూ వ్యాఖ్యానించారు. దీంతో వారు పునరాలోచనడలో పడ్డారు.