దావూద్ కార్లు ఇస్తానన్నాడు – వెంగ్‌సర్కార్
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత జట్టు క్రికెటర్లకు ఖరీదైన కార్లు ఇస్తానని ఆశచూపినట్టు చెప్పాడు. ఈ సంఘటన 1986లో ఆసియాకప్ సందర్భంగా చోటు చేసుకున్నట్టు వివరించాడు. 1986 ఆసియా కప్ ఫైనల్ షార్జాలో జరిగింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ టైటిల్ పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా దావూద్ ఇబ్రహీం భారత ఆటగాళ్ళు ఉండే డ్రెస్సింగ్‌రూమ్‌కి వచ్చినట్టు వెంగసర్కార్ చెప్పాడు.ఫైనల్లో తాము పాకిస్థాన్‌ను ఓడిస్తే… జట్టులో ఒక్కొక్కరికీ టయోటా కొరొల్లా కారును బహుమతిగా ఇస్తానని చెప్పినట్టు వెంగీ తెలిపాడు. ఒక వ్యాపారవేత్తగా డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిచయడం చేసుకున్నాడని వెల్లడించాడు. అయితే కపిల్‌దేవ్ వచ్చీ రాగానే దావూద్ ఇబ్రహీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, వెంటనే రూమ్‌లో నుండి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పినట్టు వెంగ్‌సర్కార్ వివరించాడు. కపిల్ రియాక్షన్ చూసిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన దావూద్ తన ఆఫర్‌ను రద్దు చేసుకున్నట్టు వెంగీ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో భారత్‌పై గెలిచింది. ఇదిలా ఉంటే వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలపై కపిల్ స్పందించాడు. దావూద్ ఇబ్రహీం ఎవ్వరో తనకు తెలియదని, వెంగీ అబధ్దాలు చెబుతున్నట్టు కొట్టిపారేశాడు. తానెప్పుడూ అలాంటి వ్యక్తులను కలవలేదని కపిల్ స్పష్టం చేశాడు.