ర్యాంకింగ్స్‌లో నాదల్, సెరెనా టాప్
న్యూయార్క్, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో నాదల్ 11,760 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించాడు. సెర్బియన్ స్టార్ జకోవిచ్ రెండో స్థానంలో ఉండగా… మరో స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. స్విస్ ఇండోర్స్ ఫైనల్లో ఓడిపోయిన రోజర్ ఫెదరర్ ఆరో స్థానంలో ఉండగా… టైటిల్ నెగ్గిన డెల్‌పొట్రో ఐదో స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే వచ్చే వారం లండన్‌లో జరగనున్న ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ప్రస్తుతం నాదల్, జకోవిచ్, ఫెర్రర్, ముర్రే, డెల్‌పొట్రో, థామస్ బెర్డిడ్ అర్హత సాధించారు.పారిస్ మాస్టర్స్ ముగిసిన తర్వాత మిగిలిన బెర్తులు ఎవరు దక్కించుకునేదీ తెలియనుంది. కాగా ఫెదరర్ మరో మ్యాచ్ గెలిస్తే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు 12వ సారి అర్హత సాధిస్తాడు. మరోవైపు మహిళల డబ్ల్యూటిఎ ర్యాంకింగ్స్‌లో సెరెనా విలియమ్స్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తాజాగా డబ్ల్యూటిఎ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న సెరెనా 13260 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది అమెరికా నల్లకలువ మొత్తం 11 టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. దీనిలో ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌తో పాటు వరుసగా నాలుగోసారి డబ్ల్యూటిఎ టైటిల్ కూడా నిలుపుకుంది. చివరి సీజన్‌లో మరికొన్ని టోర్నీలు మిగిలి ఉన్నప్పుటకీ… ఆమె అగ్రస్థానానికి ఢోకా లేదు. దీంతో కెరీర్‌లో మూడోసారి టాప్ ప్లేస్‌తోనే ఏడాదిని ముగిస్తోంది. బెలారస్ బ్యూటీ విక్టోరియా అజరెంకా రెండో స్థానంలోఉండగా… డబ్ల్యూటిఎ ఛాంపియన ్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన చైనా క్రీడాకారిణి లినా రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించింది. రష్యా అందాల తార మరియా షరపోవా నాలుగో స్థానంలోనూ, రడ్‌వాన్‌స్కా ఐదో స్థానంలో నిలిచారు.