గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : గడువుకు ముందే తెలంగాణ బిల్లు వస్లుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఆయన మాటలు… ‘త్వరలోనే తెలంగాణ బిల్లు వస్తుంది. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తాం. యూపీఏ కాల పరిమితి ముగిసే లోపు తెలంగాణ బిల్లు పాస్‌ చేస్తాం. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో లేదో చెప్పలేం. హైదరాబాద్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్‌పై తమ ముందుకు చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని జీవోఎం పరిశీలిస్తుంది. శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా ప్రతిపాదనలు చేసింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ అన్న అంశంపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకు ముందు పలుసార్లు అఖిలపక్షం నిర్వహించాం, రేపు కూడా నిర్వహిస్తాం. రేపటి అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తాం, 371-డీపై మంత్రుల బృందం సిఫారసుల ఆధారంగానే చర్యలు ఉంటాయి. నీటి పంపకం, విద్యుత్‌, రెవేన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. రాష్ట్ర విభజనకు ముందు అనేక సమస్యలకు పరిష్కారాలు అవసరం.
నరేంద్రమోడీకి ఎస్పీజీ భద్రత కల్పించేందుకు చట్టం ఒప్పుకోదు. చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాలపై చర్చలు జరుగుతున్నాయి. చైనా సరిహద్దుల నుంచి ఐటీబీసీ దళాలను తరలించేది లేదని పేర్కొంటూ’ మీడియా సమావేశాన్ని ముగించారు.