హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

హైదరాబాద్‌: హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తమ అభ్యంతరాలను సుప్రీం కోర్టుకు తెలియజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు వ్యాఖ్యానించి విచారణ ముగించింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్ల కాంట్రాక్టును ఓ ప్రైవేటు కంపెనీకి కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను అందించేందుకు గానూ ఉత్సవ్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టిందని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొంటూ తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారం సుప్రీంలో ఉన్నందున తాము జోక్యం చేసుకోజాలమంటూ హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. మరో వైపు ప్రతి మూడు నెలలకు సీటుకు రూ. 3,750 వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రైవేటు బస్‌ యజమానుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా విభాగానికి నోటీసులు జారీ చేసింది.