రాష్ట్ర విభజన రాజ్యాంగం ప్రకారమే: షిండే

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రకియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుషీల్‌ కుమార్‌ షిండే అన్నారు. హోంశాఖ పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2004,2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందిందని, ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి వద్ద ఉందని చెప్పారు. తెలలంగాణ బిల్లును మళ్లీ మంత్రి వర్గానికి వస్తుందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారో తనకు తెలియదన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్‌ సభలో చెప్పారని, అవిశ్వాసంపై స్పీకర్‌, ప్రభుత్వం ఎవరి బాధ్యతలను వారు నిర్వహిస్తారన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే మత హింస నిరోధక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో పరిస్థితిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిశీలిలస్తున్నట్లు షిండే వివరించారు.