తక్షణం బిల్లు పెట్టండి

మంత్రి డీకే అరుణ

తీర్మానముండదు, అభిప్రాయమే : గండ్ర

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును తక్షణపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని రాష్ట్ర సచారార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతామని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదాపై చేపట్టాల్సిన కార్యాచరణపై టీ కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం గండ్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించినట్లు వివరించారు. గతంలో తెలంగాణపై తీర్మానం కోరినా చేయలేదని, ఇప్పుడు సమైక్యాంధ్ర తీర్మానం విషయంలో కూడా ఇదే జరగనుందని ఆయన వివరించారు. తెలంగాణ బిల్లును ప్రాధాన్యతగా తీసుకుని అసెంబ్లీలో చర్చను చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. విభజన బిల్లు నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చ జరిపారు. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి చర్చించాలన్నది తమ అభిమతమని తెలిపారు. అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అసెంబ్లీకి టీ -ముసాయిదా బిల్లు వస్తుందని మంత్రి డి.కె. అరుణ తెలిపారు. తదుపరి టీ కాంగీ నేతల సమావేశం శుక్రవారం మంత్రి డి.కె. అరుణ నివాసంలో జరగనుందని గండ్ర చెప్పారు. 2009 నుంచి తెలంగాణ తీర్మానం కోసం తాము పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు విభజన బిల్లు అసెంబ్లీకి వస్తుండగా సీమాంధ్ర నేతలు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలనుకోవటం సరికాదన్నారు. అలాంటి తీర్మానానికి ఆస్కారం లేదని వారు స్పష్టం చేశారు. ముసాయిద బిల్లులో హైదరాబాద్‌ పై ఆంక్షలు పెట్టడం తగదని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌లో కీలకపదవులు పొంది సోనియాను విమర్శించడం సరికాదని దానం అన్నారు. తమ అధినేత్రి సోనియాగాంధీపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దిగ్విజయ్‌ని గో బ్యాక్‌ అనడానికి అశోక్‌బాబు ఎవరని ఆయన ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా విడిపోదామంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దానం మండిపడ్డారు.