చక్రం తిప్పుతున్న డిగ్గిరాజా

తెలంగాణ చకచకాకు పావులు

సీఎంకు కౌన్సెలింగ్‌

బొత్సకు పరామర్శ

ఈ సమావేశాల్లోనే బిల్లుకు పురమాయింపు

మేడం ఆదేశాల అమలుకు దిగ్విజయ్‌ సమన్వయం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సొంత పార్టీ నేతలు సానుకూలంగా స్పందించేలా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ చక్రం తిప్పుతున్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్‌ లేక్‌వ్యూ అతిథిగృహంలో బస చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో తలముకలయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ముందుకురానున్న నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ రాకతో రాజకీయ సెగ పెరిగింది. విభజన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారని అందుకనే వచ్చారని ప్రచారం సాగింది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా ఇవేరకమైన చర్చలు సాగుతున్నాయి. మొతతంగా డిగ్గీరాజా చుట్టూ రాజకీయాలు సాగాయి. ఈ నేపథ్యంలో వచ్చీ రాగానే సీఎం కిరణ్‌, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో దిగ్విజయ్‌ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడిపారు. లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో దిగ్విజయ్‌ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి కలిశారు.రాష్టాన్రికి వచ్చిన ఆంధప్రదేశ్‌ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణపై బుజ్జగించే ప్రయత్నాలు చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం డిగ్గీ హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా నేతలతో భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. సిఎంను బుజ్జగించడానికే డిగ్గీరాజా ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి లేక్‌ వ్యూ అతిథి గృహంలో డిగ్గీతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు భేటీ అయ్యారు. అరగంటకు పైగా వారి కొనసాగింది. ఇరువురు విభజన అంశం పైనే చర్చించారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కిరణ్‌ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.దీంతో దిగ్విజయ్‌ ముఖ్యమంత్రిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కిరణ్‌ మాత్రం విభజనకు ససేవిూరా అంటున్నారంటున్నారు. విభజన ద్వారా కలిగే నష్టాలను కిరణ్‌ వివరించగా.. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిగ్గీ చెప్పినట్లుగా సమాచారం.విభజనపై అధిష్టానంకు సహకరించాలని డిగ్గీ కోరగా.. కిరణ్‌ ససేవిూరా అన్నారని తెలుస్తోంది. సమైక్యంపై తమ నిర్ణయంలో మార్పు ఉండదని, విూరే పునరాలోచించుకోవాలని కిరణ్‌ చెప్పగా.. డిగ్గీ కూడా ఈ సమయంలో తెలంగాణపై వెనక్కి వెళ్లలేమని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారని సమాచారం. మరోవైపు ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. మంత్రుల నివాస ప్రాంగణంలోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం లేక్‌ వ్యూ గెస్టు హౌస్‌లో పలువురు నేతలను కలిశారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూనే ఉన్నారు. దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఆయనతో పాటు పలువురు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు కూడా దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో దిగ్విజయ్‌సింగ్‌ ని కలిసారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్‌ తీరుపై వారు దిగ్విజయ్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దిగ్విజయ్‌ని కలిసిన వారిలో టీ మంత్రులు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్యే బిక్షమయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు ఉన్నారు. లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో వరుస భేటీలతో బీజీగా ఉన్న దిగ్విజయ్‌ని డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ కలిసారు. తెలంగాణ బిల్లు పై అసెంబ్లీలో చేపట్టాల్సిన వ్యూహంపై దిగ్విజయ్‌ నుంచి డిప్యూటీ సీఎం పలు సూచనలను తీసుకోనున్నట్లు సమాచారం. అంతకు ముందు మంత్రి జానారెడ్డి కూడా దిగ్విజయ్‌ని కలిసారు. ఇదిలావుంటే తెలంగాణ నేతలు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు సమైక్యాంధ్ర తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ను కాంగ్రెస్‌ నేతలు అందుకున్నారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిసిన మంత్రి శైలజానాథ్‌, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇదే డిమాండ్‌ చేసారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా విభజన బిల్లును అడ్డుకునే విషయంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇదిలావుంటే లేక్‌ వ్యూ అతిథి గృహం వద్ద సీమాంధ్ర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది. దిగ్విజయ్‌ గో బ్యాక్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్టాన్న్రి సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ వారు రోడ్డు పైన బైఠాయించారు. విద్యుత్‌ సౌధలోని సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కూడా ఆందోళన చేపట్టింది. దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌నుంచి వెళ్లిపోవాలని వారు డిమాండ్‌ చేసారు. అలాగే సచివాలయంలో కూడా దిగ్విజయ్‌కు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దిగ్విజయ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దిగ్విజయ్‌ రాకతో లేక్‌ వ్యూ అతిధి గృహం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమైక్యవాదుల నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌కు సమైక్యవాదుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సీఐఎస్‌ఎఫ్‌ ఆర్‌ఏఎఫ్‌, టాస్క్‌ ఫోర్స్‌ బలగాలు మోహరించాయి. అనుమతి ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. లేక్‌వ్యూగెస్ట్‌హౌస్‌లో ఉన్న డిగ్గీని సిఎం కలిశారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం కిరణ్‌కు దిగ్విజయ్‌ చెప్పనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు సీఎం కిరణ్‌ను దిగ్విజయ్‌ పిలిచారు. బిల్లు ఎప్పుడు పెట్టాలి? ఎన్ని రోజులు చర్చించాలో సీఎంకు దిగ్విజయ్‌ సూచించారు. బిల్లు సజావుగా శాసనసభ అభిప్రాయం పొందేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొంది ఇంటికి వచ్చిన బొత్సను ఆయన నివాసానికి వెళ్లి డిగ్గిరాజా పరామర్శించారు.