తక్షణం బిల్లు పెట్టండి

దిగ్విజయ్‌ను కోరిన కోదండరామ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను వెంటనే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో చర్చకు పెట్టాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో టీ జేఏసీ నేతలతో కలిసిన ఆయన దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పది జిల్లాల ప్రజల ఆకాంక్ష అని దీనిపై ఎలాంటి తాత్సారం లేకుండా త్వరగా ప్రక్రియ ముగించాలని ఆయన తెలిపారు. 2009 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 1100 మందికి పైగా యువత, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్‌ తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలిగించబోమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున జేఏసీ నాయకులకు టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలని దిగ్విజయ్‌ ఆహ్వానించారు. దీనికి కోదండరామ్‌ బదులిస్తూ రాజకీయాలపై తమంతగా ఆసక్తి లేదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని తేల్చిచెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ తరపున ప్రచారమైన చేయాలని దిగ్విజయ్‌ కోరినా కోదండరామ్‌ సహా నేతలెవరూ స్పందించలేదు. రాజకీయాల్లోకి తమను లాగొద్దని ప్రజల ఆకాంక్షల మేరకు త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం త్వరగా తెప్పించి వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కోరారు. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. కోదండరామ్‌ వెంట టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, మమత, అద్దంకి దయాకర్‌ తదితరులు ఉన్నారు.