తెలంగాణ బిల్లు తక్షణమే పెట్టండి
టీజేఏసీ చైర్మన్ కోదండరామ్
గోదావరిఖని, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తదుపరి కార్యచరణ కోసం రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తక్షణం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని టీ జేఏసీి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కోరారు. ఆదివారం రామగుండం మండలం జనగామ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఈ బిల్లుపై అభిప్రాయాలను నమోదు చేసి ఢిల్లీకి పంపించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకుల కనుసైగల్లో కిరణ్‌బాబు, జగన్‌బాబు, చంద్రబాబు నడుచుకుంటూ మూర్కత్వంతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ బాబుత్రయం చేస్తున్న కుట్రలు వేగవంతమైన రాష్ట్ర ప్రక్రియను ఎంతమాత్రము అడ్డుకోలేవన్నారు. వీరి నాటకాలకు తెరపడుతుందన్నారు. అన్ని బిల్లుల్లాగ రాష్ట్ర పునర్విభజన మామూలు బిల్లు అయినప్పటికీ రాష్ట్రపతి నుంచి వచ్చే బిల్లుకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎజెండాలో ఎన్ని అంశాలున్న ఈ బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఆంగ్ల భాషలో ఉన్న ఈ బిల్లుకు అనువాదంలో సాంకేతిక కారణాలు చోటుచేసుకున్నాయని ఈ అనువాదం పూర్తయిన తరువాతనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతామననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ముసాయిదాలోని ఇంగ్లిష్ సహజంగానే ఉందన్నారు. అనువాదానికి చాలా అనువుగా ఉందన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ఈ బిల్లుపై ఓటింగ్ ఉండదని కేవలం అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాల్సి ఉంటుందని, ఈ పునర్విభజనకేవలం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకులు మాట్లడడం ఎంత వరకు సమంజసమన్నారు. అంబేద్కర్ సూచన మేరకు ఏనాడో రాజ్యంగంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సవరణ జరిగిందన్నారు. శాసనసభ సమావేశంలో ఉందనే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదంతో పంపినప్పటికీ బిల్లును అభిప్రాయ నివేదనకు నివేదించడంలో సీమాంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతున్నదన్నారు. ఆంధ్ర నాయకుల వైఖరి అన్యాయం అన్నారు. ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదన్నారు. కాగా, జీఓఎం ప్రకటించిన కొన్ని అంశాలు శాస్రీయంగా లేకపోవడంతో కొన్ని మార్పులు చేయాలని, ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని తెలంగాణ జెఏసి జిఓయంకు నివేదించిందని అలాగే దిగ్విజయ్‌సింగ్‌ను కోరడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టిజెఏసి కో-చైర్మన్ మల్లేెపల్లి లక్ష్మయ్య, స్థానిక నాయకులు బల్మూరి అమరేందర్ రావు, వనిత తదితరులు పాల్గొన్నారు.