అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనన్న భారత్‌

ఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని అరెస్టు, విచారణ విషయంలో అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆ దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. కేవలం సానుభూతి ప్రకటించినంత మాత్రాన సరిపోదని, తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పేవరకు సంతృప్తి చెందబోమని కమల్‌ నాథ్‌ తెలిపారు. ఈ వ్యవహారం పట్ల భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడుతానని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి జాన్‌కెర్రీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్‌ మెనన్‌కు ఫోనులో వెల్లడించినట్లు సమాచారం. ఈ దురదృష్టకర సంఘటన ఇరు దేశాల సన్నిహిత సంబంధాలను దెబ్బతీయకుండా చూడడం తమ విధి అని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారత దౌత్యవేత్తపై అన్ని కేసులు ఉపసంహరించాలని, కేసులు ఉపసంహరించుకున్నప్పుడే మన అధికారిణికి న్యాయం జరిగినట్లని ప్రధాన ప్రతిపక్షం భాజపా డిమాండ్‌ చేస్తోంది. దేవయానిని ఇప్పుడు యూఎన్‌ పర్మనెంట్‌ మిషన్‌కు మార్చినట్లు భారత్‌ ప్రకటించింది. దీంతో ఆమెకు ఒక దౌత్యవేత్తకు లభించాల్సిన అన్ని ప్రత్యేక హక్కులు పూర్తిస్థాయిలో లభిస్తాయి. భారత్‌ ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తెలిపింది.