వచ్చే లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణ బిల్లు
కేంద్రం హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, డిసెంబర్ 19 (జనంసాక్షి) :
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లు ముసాయిదా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం శాసనసభ, మండలిలో ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మత హింస నిరోధక బిల్లు కూడా తీసుకొస్తామని షిండే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి జనవరి 23లోగా అభిప్రాయం చెప్పాల్సి ఉందని అన్నారు. ఆలోగా శాసనసభ, మండలి అభిప్రాయం రాష్ట్రపతికి వస్తుందని, రాష్ట్రపతి నుంచి బిల్లు కేబినెట్‌కు రాగానే మరోసారి పరిశీలించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతామన్నారు. వీలైతే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని, లేనిపక్షంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పూర్తవుతుందని, దీనికి మరో నెలన్నర సమయం పట్టవచ్చన్నారు. తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాల్సిన సమయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాయిదా పడటం పెద్ద విషయమేమీ కాదని, జనవరిలో జరగబోయే సమావేశాల్లో అభిప్రాయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. సభ్యులు లిఖిత పూర్వకంగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చన్నారు. దేశంలో మత హింస నిరోధానికి యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.