జస్టిస్‌ గంగూలీ లేఖపై న్యాయ విద్యార్థిని ఆగ్రహం

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివంకు రాసిన లేఖపై న్యాయ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ తప్పించుకోవడానికి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై ఆరోపణలన్నీ అవాస్తవాలని, తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు శక్తిమంతులు పన్నిన కుట్ర అని పేర్కొంటూ జస్టిస్‌ గంగూలీ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 8 పేజీల లేఖలో ఆయన ఆరోపణలను విచారిస్తున్న కమిటీ తన వాదనను సరిగా వినలేదని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ న్యాయమూర్తి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయవిద్యార్థిని ఆ సమయంలో తన విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఫిర్యాదులు విచారించడానికి సరైన యంత్రాంగం లేకపోవడంతో తాను వెంటనే ఫిర్యాదు చేయలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడమే అప్పుడు తన ముందున్న మార్గమని, అది తనకు ఇష్టం లేక వూరుకున్నానన్నారు. యువ న్యాయ విద్యార్థులకు హెచ్చరికగా ఉండడం కోసమే తానీ విషయాన్ని వెల్లడించానని, హోదాని బట్టి నైతిక ప్రమాణాలు ఉంటాయని పొరబడకూడదని చెప్పదలుచుకున్నానని ఆమె పేర్కొన్నారు.