‘ ప్రధానిగా నరేంద్రమోడీ’ ప్రచారం ప్రారలంభించనున్న భాజపా

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 10 కోట్ల ప్రజలను చేరడానికి ‘ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ’ అన్న సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భాజపా నేతలు నిర్ణయించారు. మంగళవారం భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అగ్రనేతల సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. బచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరింత సూటిగా, మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, రూ. 10 నుంచి గరిష్ఠంగా రూ. వెయ్యి వరకు ఇవ్వవచ్చని భాజపా జనరల్‌ సెక్రటరీ అనంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రచారంతో పోలింగ్‌ బూత్‌ స్థాయిలోనూ అత్యధిక ప్రజలను చేరేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ప్రేరణగా ఉపయోగించనుంది. పార్టీ అధినాయకత్వం జనవరిలో నిర్వహించనున్న భాజపా కౌన్సిల్‌, ఎగ్జిక్యూటివ్‌ సమావేశానికి కూడా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు.