పది రోజులు గడువివ్వండి..

దుమ్ముదులిపేస్తా
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు పది రోజుల గడువివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. పది రోజుల్లో ఢిల్లీకి పట్టిన దుమ్ము దులిపేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈలోగా పాలనను గాడిలో పెడతానని కేజ్రీవాల్‌ అన్నారు. ఆదివారం ఆయన జనతాదర్బార్‌ నిర్వహించారు. దర్బారులో ఆయన మాట్లాడుతూ వారం, పది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన మరుసటి రోజు కేజ్రీవాల్‌ బిజీబిజీగా ఉన్నారు. తన నివాసంలోనే అధికారులు, మంత్రులతోను చర్చలు జరిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ప్రజల మద్దతుతోనే ఢిల్లీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారిస్తానని కేజ్రీవాల్‌ అన్నారు. ఎలాంటి అడ్డంకుల్లేకుండా అవినీతి రహిత పాలన కోసం ప్రజల మద్దతు తనకెంతో అవసరమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రజల సహకారమే లేకుండా తామేమీ చేయలేమని ఆయన పేర్కొన్నారు. తాము కేవలం అధికారపగ్గాలు మాత్రమే చేపట్టామని సమస్యలపై దృష్టి సారించేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. సమస్యల పరిష్కార వ్యవస్థ రూపకల్పనకు పది రోజులు పడుతుందని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు కార్మికులుగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, మునిసిపల్‌ శాఖల్లో సేవలదింస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని ఆయా శాఖ ఉద్యోగులు, కార్మికులు కేజ్రీవాల్‌ను కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.