జస్టిస్‌ గంగూలీని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధం

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏకే గంగూలీని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది.ఈ మేరకు ప్రభుత్వ నోట్‌ తయారైందని, గురువారం కేంద్ర కేబినెట్‌ దీన్ని ఆమోదించనుందని సమాచారం. జస్టిస్‌ గంగూలీపై శిక్షణలో ఉన్న మహిళా న్యాయవాది ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసిన విచారణ సంఘం జరిగిన దాంట్లో జస్టిస్‌ గంగూలీ తప్పు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి జస్టిస్‌ గంగూలీని తప్పించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు.