కోల్‌కతాలో బాలిక అంత్యక్రియల విషయంలో వివాదం

కోల్‌కతా : అత్యాచార బాధితురాలైన ఒక బాలిక అంత్యక్రియల విషయంలో బుధవారం కోల్‌కతాలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. వామపక్షాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 16 ఏళ్ల బాలికపై గత అక్టోబర్‌లో అత్యాచారం జరిగింది. ఆ అవమానంతో ఆమె డిసెంబర్‌ 23న కిరోసిన్‌ పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నిన్న మరణించింది. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్న బాలిక తండ్రి సీఐటీయూలో పనిచేస్తున్నాడు. బాలిక కుటుంబం, యూనియన్‌ ఈ రోజు నగరంలో ఒక ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచాలనుకున్నారు. పోలీసులు కుటుంబానికి తెలియకుండా బాలిక మృతదేహాన్ని రాత్రే శ్మశానానికి తరలించారు. మరణధ్రువీకరణ పత్రం వారి వద్ద లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు. విషయం యూనియన్‌ నేతలకు తెలపడంతో ఈ రోజు ఉదయం వారు ఆందోళన చేపట్టారు. బాలిక మృతదేహాన్ని తీసుకున్న తల్లిదండ్రులు ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.