బాలిక ఆత్మహత్య చేసుకోలేదు… తగలబెట్టారు: కోల్‌కతా పోలీసులు

కోల్‌కతా : కోల్‌కతాలో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆక్టోబరులో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక అవమానంతో డిసెంబరు 23న ఆత్మహత్య చేసుకుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించడం, బుధవారం అంత్యక్రియల విషయంలో పోలీసులతో వామపక్ష పార్టీ నేతల వాగ్వివాదం తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు ఉపసంహరించుకోవడానికి ఆమె నిరాకరించడంతో నిందుతులే కిరోసిన్‌ పోసి ఆమెకు నిప్పంటించారని పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రికి వామపక్షాలతో అనుబంధం ఉండడం, ఆయన నిన్న గవర్నరుకు లేఖ రాయడంతో ఇప్పుడీ కేసు మమతాబెనర్జీకి మరో తలనొప్పిగా మారింది. కుమార్తెకు మంచి చదువు చెప్పించాలని కొన్ని నెలల క్రితమే కోల్‌కతా వలసవచ్చిన కుటుంబంలో ఈ ఘోరం జరగడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది.