స్విస్ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా సైనా
న్యూఢిల్లీ ,మార్చి 8 :ఆల్‌ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన సైనానెహ్వాల్ ఇప్పుడు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీకి సిధ్ధమైంది. మంగళవారం నుండి మొదలయ్యే ఈ టోర్నీలో సైనా ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది ఆశించిన స్థాయిలో రాణించని హైదరాబాదీ కొత్త ఏడాదిలో సయ్యద్ మోడీ టైటిల్ గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. అయితే కాస్త విరామం తర్వాత ఆల్‌ఇంగ్లాండ్ బరిలో దిగినప్పటకీ పతకం కల నెరవేరలేదు. దీంతో స్విస్ ఓపెన్ ద్వారా మళ్ళీ విజయాల బాట పట్టాలని సైనా భావిస్తోంది. ఈ హైదరాబాదీ షట్లర్ 2011 , 2012లలో స్విస్ ఓపెన్ కైవసం చేసుకుంది. గత ఏడాది మాత్రం సెవిూస్ వరకే చేరగలిగింది. ఈ సారి ఆరోసీడ్‌గా ఆడనున్న సైనాకు క్లిష్టమైన డ్రానే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పివి సింధు ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. అలాగే ఇదే కేటగిరీలో సెయిలీ రాణెళి కూడా ఆడనుంది. అటు పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కష్యప్ మూడో సీడ్‌గా ఆడనున్నాడు.మరో ఆటగాడు కె.శ్రీకాంత్‌కు ఐదో సీడింగ్ లభించింది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప , మిక్సిడ్ డబుల్స్‌లో తరుణ్-అశ్విని జోడీలు ఆడనున్నాయి.