విద్యుత్ సరఫరాలో అంతరాయం పలు రైళ్ల రాకపోకలు నిలిపివేత
హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో కాలిబాట వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన పిల్లర్లపై అమర్చుతున్న ఇనుపరాడ్లు కూలడంతో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి కాగజ్‌నగర్ కాజీపేట విజయవాడ ప్యాసింజర్ రైలు, కాజీపేటలో ఏపీ ఎక్స్‌ప్రెస్, పెండ్యాల వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. హైటెన్షన్ విద్యుత్ వైర్లు మరమ్మత్తు పనులకు 4 గంటల సమయం పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.