పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి … భూదేవంత  పీట  …పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని  కల్యాణమండపానికి తరలించారు.  మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి ..శ్రీమహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు.  వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. రాముని కళ్యాణానికి  గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.జిల్లాలోని భద్రాచలం పట్టణంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తంలో శ్రీరామచంద్రుల వారు సీతాదేవి తలపై జీలకర్ర బెల్లం 12గంటలకు పెట్టాడు. తర్వాత మూడు సూత్రాల మాంగల్య ధారణ జరిగింది. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని వేదపండితలుల జరిపించారు. పత్రి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది రాష్ట్రపతి పాలన కొనసాగటంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మొదటిసారిగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టిటిడి తరపున దేవాలయ చైర్మన్ కనుమూరి బాపిరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు.
 రాష్ట్ర నలుమూలల నుండి సుమారు రెండు లక్షల మంది భక్తులు కళ్యాణమహోత్సవ వేడుకను తిలకించేందుకు వచ్చారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ సుమారు వెయ్యు మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదట స్వామివార్లను దేవాలయం నుండి మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య పల్లకిలో సీతారామ, లక్షణుడు, హనుమంతులను దేవాలయం నుంచి మండపానికి తీసుకువచ్చారు. ఉదయం గవర్నర్ నరసింహన్ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామివార్ల కళ్యాణమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తాజావార్తలు