చుండూరు ఊచకోత కేసు నిందితులకు శిక్ష రద్దు : హైకోర్టు


చుండూరు ఊచకోత కేసులో నిందితులకు ఊరట

శిక్షను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :చుండూరు దళితుల ఊచకోత కేసులో నిందితులకు శిక్ష రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరిం చిం ది. దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. 21 మందికి జీవిత ఖైదును, 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో చుండూరులో సంబరాలు చేసుకోకుండా చూడాలని ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా చుండూరుకు బలగాలను పంపాలని ఆదేశించింది. 199 1లో గుంటూరు జిల్లా చుండూరులో దళితులను ఊచకోత కోసిన విషయం విదితమే. నేదురుమల్లి జనార్థనరెడ్డి కాంగ్రెస్‌ పాలనలో చుండూరు మారణ కాండ జరిగింది. 1991 జులై 10న చుండూరు గ్రామంలో రెడ్లు, కాపులకు, దళితులకు మధ్య చెదురుముదురు ఘటనలు జరిగాయి. చెదురుముదురు ఘటనలు, సోడాబుడ్లు విసురుకోవడంతో చేసేది ఏమి లేక జులై 10 నుంచి ఆగస్టు 5 వరకు పోలిస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ విధించారు. చివ రకు ఈ అల్లర్లు గొళ్లమూడి యాకుబు అనే దళితుడిపై హత్యాయత్నానికి దారి తీసింది. ఆ ముందు రోజు రాత్రి చుండూరు,
మున్నంగిదారిపాలెం, మోదుకూరు, వలివేరు గ్రామాల రెడ్లు, కాపులు సమావేశమై తమ పెత్తనాన్ని ఎదురించే దళితులకు సాయుధ గుణపాఠం చెప్పాలని తీర్మానం చేశారు. ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు పోలీసులు చుండూరు మాల, మాదిగ పల్లెలపై దాడి చేశారు. చుండూరులో దళితుల ఊచకోతపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ, అలాగే 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు బాధితులు, ఇటు శిక్ష పడిన నిందితులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. 1991లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారులు పూర్తి సాక్షులను కోర్టు ముందు ఉంచలేకపోయారని, అలాగే నిందితులు ఎవరన్న దానిపై సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు పేర్కొంది. 8 మంది దళితులను ఊచకోత కోసిన ఘటన అత్యంత బాధాకరమని, ఈ విషయం దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయాన్ని కూడా న్యాయస్థాన గుర్తు చేసింది. అయితే నిందితులు ఇప్పటికే కొన్ని ఏళ్లు జైల్లో ఉన్నారని, వారి కుటుంబాలు తీరని క్షోభకు గురయ్యాయని, దీనిని ఏ మాత్రం పూడ్చలేనిదని కోర్టు అభిప్రాయపడింది. తీర్పు నేపథ్యంలో చుండూరు, మోదుకూరు గ్రామాల్లో ఎలాంటి సంబరాలు, నిరసనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కోర్టు గుంటూరు ఎస్పీని ఆదేశించింది. అంతేకాకుండా 3 నెలల పాటు ఆయా గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై దళితులు మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు తెలిపారు. చుండూరు కేసులో నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాగా దర్యాప్తు అధికారులను తప్పుబడుతూ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని జిల్లా ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు.