మోడీ పవనాలు మీడియా సృష్టి : మన్మోహన్‌


గౌహతి, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
దేశంలో మోడీ మేనియా పేరుతో సాగుతోన్న ప్రచారం ఒకవర్గం మీడియా సృష్టేనని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందన్న వార్తలను కొట్టిపడేశారు. అదంతా మీడియా ప్రచారమేనని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఓటు వేశారు. అసోంలోని గౌహతి లోక్‌సభ స్థానం పరిధిలో డిస్పూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో మన్మోహన్‌ తన భార్య గురుశరణ్‌ కౌర్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభావమేమీ లేదని స్పష్టం చేశారు. అదంతా విూడియా సృష్టేనని పేర్కొన్నారు. ‘మోడీ ప్రభావమేవిూ లేదు. ఇదంతా కేవలం విూడియా సృష్టే. దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం ఉందన్నది వట్టిదే’నని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందని తాను భావించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలవుతుందన్నది వాస్తవం కాదు. ఫలితాలు వెల్లడయ్యే మే 16 వరకు వేచి చూడండి. మేం కచ్చితంగా మెజార్టీ సాధిస్తాం’ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మన్మోహన్‌ అభ్యర్థించారు. ప్రత్యేక విమానంలో అసోం వచ్చిన ప్రధానికి ముఖ్యమంత్రి తరుణ్‌ గగోయ్‌, పీసీసీ అధ్యక్షుడు భువనేశ్వర్‌ కాలిటా ఘన స్వాగతం పలికారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని దంపతులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. మన్మోహన్‌సింగ్‌ 1991 నుంచి అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.