చిత్తూరు జిల్లా నడవలూరులో భారీ రిగ్గింగ్

 హైదరాబాద్, మే 7: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగు చాలా దారుణంగా జరుగుతోంది. అంతా ఏకపక్షంగా వైసీపీ కార్యకర్తలు భారీగా రిగ్గింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా రామచంద్రాపురం మండలం నడవలూరులో వైసీపీ ఆగడాలకు అంతు లేకుండాపోయింది. వైసీపీ కార్యకర్తలు గూండాలలా ప్రవర్తించి ఏబిఎన్ ఓబీ వ్యానుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏబిఎన్ ఓబీ వ్యాను అద్దాలు పగిలిపోయాయి. డ్రైవర్‌కు, ఓబీ ఇంజనీరుకు గాయాలయ్యాయి. ఒకవైపు పోలింగు బూత్ లోపల రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగిపోతుండగా మరో వైపు వైసీపీ కార్యకర్తలు మీడియాపై దాడులు కొనసాగిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు టివి9 వ్యానుపై కూడా దాడి చేశారు. ఏబిఎన్ ఓబి వ్యానులో ఉన్న ఇంజనీరును కూడా వైసీపీ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. ఈ పోలింగు బూత్ లోపల వైసీపీ కార్యకర్తలు ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను కొట్టి భారీగా రిగ్గింగ్ చే స్తుండగా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు.

ఈ సంఘటన గురించి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తీవ్రంగా స్పందించారు. పోలింగు సరళి గురించి ఆయన హైదరాబాద్‌లో మీడియాకు వివరిస్తున్న సమయంలో ఈ సంఘటన గురించి మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తగినంత పోలీసు బందోబస్తు చేస్తామని, మీడియాకు పూర్తి భద్రత కల్పిస్తామనీ ఆయన హామీ ఇచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లా అర్బన్ ఎస్.పి. ఆ తర్వాత ఏబిఎన్‌తో మాట్లాడుతూ పోలీసులు తగినంత సంఖ్యలోనే ఉన్నారని, దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కూడా నడవలూరులో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. బుధవారంనాడు కూడా ఇదే పరిస్థితి తలెత్తినట్టు తెలియడంతో అన్ని ప్రధాన పత్రికల, టీవీ ఛానళ్ల ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మీడియా ప్రతినిధులను దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే శ్మశానం వద్ద వైసీపీ కార్యక ర్తలు ఆపేశారు. పోలీసు అధికారుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు బాగా మద్యం సేవించి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. కొందరు కావాలనే ఏబీఎన్ సీనియర్ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మీడియాకు భద్రత కల్పించకపోగా, మీడియా ప్రతినిధులనే వెళ్లిపోండని గద మాయించారు.

పోలింగు బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోందని, అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించడానికి వచ్చాం కాబట్టి తమకు భద్రత కల్పించి బూత్‌లోకి అనుమతించాలని పోలీసులను కోరినా వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారులైతే ముందు ఇక్కడనుంచి మీరు వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిపోయింది. వైసీపీ నేతకు మద్దతుగా పోలీసులు మీడియాపైనే లాఠీ చార్జికు ఉపక్రమించారు. స్థానిక మహిళలను ముందుకు తీసుకువచ్చిన వైసీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

మాజీ మంత్రి గల్లా అరుణ తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి ముందుగానే పథకం ప్రకారం కడప నుంచి వైసీపీ కార్యకర్తలను భారీగా దించినట్టు తెలుస్తున్నది. కడపనుంచి పోలీసులు కూడా నడవలూరుకు వచ్చినట్ట తెలుస్తున్నది, పరిటాల రవి హత్య కేసులో నిందితులైన వారిని కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి దించినట్టు తెలుస్తున్నది.