కెసిఆర్… వైఎస్ జగన్‌కు వత్తాసు పలకడం మేంటి? : శ్రవణ్

హవ్వ..సమైక్యవాద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతా..
హైదరాబాద్  : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించడం వల్లే 1500 మంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలు బలిదానం చేశారన్నారు.2009లోనే సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లకార్డు పట్టుకున్న జగన్‌కు మద్దతునివ్వడం ద్వారా కెసిఆర్, దోపిడీ దొంగలకు వత్తాసునిస్తున్నారని చెప్పారు.  జగన్మోహన రెడ్డి నాలుగైదు ఏళ్లుగా భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించిన కెసిఆర్, తాజాగా ఆయనే సీమాంధ్ర సిఎం అవుతారని చెప్పడంలో ఆంతర్యమేమిటని శ్రవణ్ నిలదీశారు. కెసిఆర్, తమది తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ పక్కరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం దేనికని శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏనాడూ కెసిఆర్ విమర్శించనప్పుడే తమకు అనుమానం వచ్చిందన్నారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందమేమిటో బయట పెట్టాలని శ్రవణ్ కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కు కోట్లాది రూపాయలు దోచి పెట్టారని ఆరోపణలు గుప్పించిన కెసిఆర్, ఇప్పుడు అదే జగన్ సీమాంధ్రకు సిఎం అవుతారని చెప్పడం కూడా రహస్య ఒప్పందంలో భాగమేనా అని శ్రవణ్ ప్రశ్నించారు. కెసిఆర్ మాటలు రోజుకో మాట, పూటకో సామెత మాదిరిగా ఉన్నాయని చెప్పారు.ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడిన కెసిఆర్, ప్రచారంలో మాత్రం మతతత్వ పార్టీతో కలిసి వెళ్లనని చెప్పారని శ్రవణ్ పేర్కొన్నారు. ఎన్నికలయ్యాక ఇప్పుడు యూపిఏకు మద్దతిస్తామని చెబుతున్న కెసిఆర్, ఫలితాల వెల్లడి తర్వాత ఏమంటారోనని శ్రవణ్ వ్యంగ్యోక్తులు విసిరారు.